జోరు మీదున్న నిర్మాతలు

Last Updated on by

నిర్మాత‌లకు డ‌బ్బులు పెట్టే త‌త్వం కాదు.. క‌థ‌ను జ‌డ్జ్ చేసే జ్ఞానం కూడా ఉండాలి. ఏది వ‌ర్క‌వుట్ అవుతుంది.. ఏది కాదు అని చెప్పే స‌త్తా కూడా ఉండాలి. అలా ఉంది కాబ‌ట్టే రామానాయుడు లాంటి వాళ్లు అలా నిలిచిపోయారు. ఇప్పుడు దిల్ రాజు కూడా ఇదే చేస్తున్నాడు. ఓ క‌థ ఎంపిక చేసి అది ప‌ట్టాలెక్కి పూర్త‌య్యేంత వర‌కు కూడా త‌న వంతు సాయం చేస్తూనే ఉంటాడు. ఇలాంటి నిర్మాత‌ల‌కు పోటీగా ఇప్పుడు మైత్రి మూవీ మేక‌ర్స్ వ‌స్తున్నారు. ఈ రోజుల్లో ఒక్క హిట్ కొట్ట‌డ‌మే గ‌గ‌నంగా మారింది. అలాంటిది భారీ బ‌డ్జెట్ పెడుతూ.. స్టార్ హీరోల‌తో వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. కానీ ఇది చేసి చూపించింది మైత్రి మూవీ మేక‌ర్స్. కొర‌టాల శివ చేతుల మీదుగా మొద‌లైన ఈ బ్యాన‌ర్ ఇప్పుడు వెలిగి పోతుంది. వ‌ర‌స విజ‌యాల‌తో దుమ్ము దులిపేస్తుంది. స్టార్ హీరోల‌కు ఈ బ్యాన‌ర్ ల‌క్కీ అయిపోయింది. ఇందులో న‌టిస్తే చాలు వాళ్ల కెరీర్ లోనే పెద్ద విజ‌యాలు వ‌చ్చేస్తున్నాయి. మ‌హేశ్ బాబుకు శ్రీ‌మంతుడే ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద హిట్. అది ఇచ్చింది మైత్రి మూవీ మేక‌ర్సే. కొర‌టాల తెర‌కెక్కించిన ఈ చిత్రం 2015లో వ‌చ్చింది. 80 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది.

ఇక రెండో సినిమా జ‌న‌తా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద హిట్. ఇది కూడా కొర‌టాలే తెర‌కెక్కించాడు. దీనికి 80 కోట్ల‌కు పైగానే క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఇక మొన్న‌ రంగ‌స్థ‌లం. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం 125 కోట్ల‌కు పైగా షేర్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది. ప్ర‌స్తుతం మైత్రి జోరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ సంస్థ నుంచి ఒక‌టి రెండు కాదు.. ఏకంగా అర‌డ‌జ‌న్ సినిమాలు వ‌స్తున్నాయి. దిల్ రాజు త‌ర్వాత అంతటి ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్న నిర్మాత‌లు వీళ్లే.

స్టార్ హీరోలు.. చిన్న హీరోలు అని తేడా లేకుండా అంద‌రితోనూ సినిమాలు నిర్మిస్తున్నారు వీళ్లు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో స‌వ్య‌సాచి.. ర‌వితేజ‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. తెరీ రీమేక్ తో పాటు విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా సినిమాల‌ను నిర్మించ‌నున్నారు. ఇక విజ‌య్ దేవ‌రకొండ‌తో డియ‌ర్ కామ్రేడ్ సినిమా కూడా మైత్రి సంస్థ‌లోనే వ‌స్తుంది. ఇలా ఇప్పుడు వ‌ర‌స‌గా ఆరు సినిమాలు ఈ సంస్థ‌లోనే ఉన్నాయి. వాటికితోడు చిరంజీవితోనూ ఓ సినిమాకు క‌మిట్ మెంట్ తీసుకున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్. మొత్తానికి ఇప్పుడు వీళ్ల జోరు ముందు మిగిలిన నిర్మాణ సంస్థ‌లు నిల‌బ‌డ‌లేక‌పోతున్నాయి.

User Comments