`మా` ఎన్నిక‌లు శివాజీ ఏక‌గ్రీవ‌మేనా?

మూవీ ఆర్టిస్టుల సంఘం `మా` అసోసియేష‌న్ లో ఏం జ‌రుగుతోంది? మార్చి 10న ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టికే జేగంట మోగింది. ఈసారి ఎవ‌రెవ‌రు పోటీకి దిగుతున్నారు? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. య‌థావిధిగా ఈసారి కూడా అధ్య‌క్షుడిగా శివాజీరాజానే ఉండాల‌ని ఆర్టిస్టులు కోరుకుంటున్నారు. నిన్న‌టిరోజున హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో జ‌రిగిన శివాజీ రాజా బ‌ర్త్ డే వేడుక‌ల వేదిక‌పై ఆర్టిస్టులంతా శివాజీ రాజానే మ‌రోసారి అధ్య‌క్షుడు కావాలంటూ నినాదాలు చేశారు. త‌న‌కు ఇష్టం లేక‌పోయినా వాళ్లు అడిగినందుకే మ‌రోసారి పోటీ చేస్తున్నాన‌ని శివాజీ రాజా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌న ప్యానెల్ స‌భ్యుల్ని ప్ర‌క‌టించి శివాజీ స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ మేర‌కు పోస్ట‌ర్లు, ఫ్లెక్సీలు ఫిలింఛాంబ‌ర్ లో ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఈసారి శివాజీ ప్యానెల్ లో ఎస్వీ కృష్ణారెడ్డి, త‌నీష్ వంటి వాళ్లు చేర‌డం ఆస‌క్తి క‌లిగించింది. బెన‌ర్జీ, ఉత్తేజ్, వేణు మాధ‌వ్ వంటి వారు ఈసీ స‌భ్యులుగా పోటీకి దిగుతున్నారు.

మెజారిటీ పార్ట్ ఆర్టిస్టులు శివాజీ రాజా వైపే మొగ్గు చూప‌డంపై ఆసక్తిక‌ర చ‌ర్చ సాగింది. చిన్నా చిత‌కా ఆర్టిస్టులు స‌హా అంద‌రితో క‌నెక్టివిటీ.. చేస్తున్న సేవ‌లు ప్ల‌స్ అన్న చ‌ర్చ సాగింది. ఆర్టిస్టులే వ‌చ్చి జై కొట్ట‌డం అత‌డికి క‌లిసొచ్చేదేన‌న్న ముచ్చ‌ట సాగుతోంది. మార్చి 10న మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నిక జ‌ర‌గ‌నుంది. శివాజీ రాజా ప్యానెల్ ని ప్ర‌క‌టించారు. అయితే మేం ప్ర‌త్య‌ర్థిగా పోటీకి దిగుతున్నాం అంటూ ఎవ‌రూ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ పోటీ బ‌రిలో లేక‌పోవ‌డంతో శివాజీ రాజాను ఏక‌గ్రీవంగా ఖాయం చేయండి అంటూ ఆర్టిస్టులు మ‌రోసారి నిన‌దించారు. అయితే పోటీ లేద‌ని నేనెలా చెప్ప‌గ‌ల‌ను? `మా` అసోసియేష‌న్ నా జాగీర్ కాదు క‌దా.. ఎవ‌రైనా పోటీకి రావొచ్చు! అంటూ శివాజీ రాజా హుందాత‌నాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంపై మీడియాలో ఆస‌క్తిగా చ‌ర్చ సాగింది. గ‌త ఏడాది ర‌క‌ర‌కాల వివాదాల సంద‌ర్భంగా సీనియ‌ర్ న‌రేష్ శివాజీ రాజాపై నింద‌లు మోపిన సంగ‌తి తెలిసిందే. అందుకే ఈసారి శివాజీ రాజాకు వ్య‌తిరేకంగా అత‌డు అధ్య‌క్ష ప‌ద‌వి రేస్ లో ఉంటాడ‌ని అంతా భావిస్తున్నారు. అయితే న‌రేష్ ఆ సంగ‌తిని మీడియా ముందు ప్ర‌క‌టించాల్సి ఉందింకా.