అవ‌న్నీ గాలి వార్త‌లు అన్న `మా`

`మా` అధ్య‌క్షుడు న‌రేష్ కు ఎగ్యిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజ‌శేఖ‌ర్ త‌న వ‌ర్గంతో క‌లిసి న‌రేష్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చిన‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌పై `మా `కార్య‌వ‌ర్గం స్పందించింది. అవ‌న్నీ కేవ‌లం సోష‌ల్ మీడియాలో పుకార్లు మాత్ర‌మేన‌ని..ఎవ‌రికి ఎలాంటి నోటీసులు ఇవ్వ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. న‌రేష్, రాజ‌శేఖ‌ర్ మంచి స్నేహితుల్లా ఉన్నార‌ని, వాళ్ల మ‌ధ్య మైత్రీ దెబ్బ‌తిన‌లేదని చెప్పే ప్ర‌య‌త్నం చేసింది.

`మా` అసోసియేష‌న్ లో చాలా స‌మ‌స్య‌లుంటాయి. వాటన్నింటినీపై అంద‌రూ చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. `మా` వెల్ఫేర్‌కి సంబంధించి అత్య‌వ‌స‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు గురించి మంగ‌ళ‌వారం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జ‌రిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు సంబంధించి మీడియాకు తెలియ‌జేయాల్సిన విష‌యాలుంటే అధికారికంగా మేమే తెలియ‌జేస్తాం అని `మా` అసోసియేష‌న్ కార్య‌వ‌ర్గం తెలిపింది. శివాజీరాజా అధ్య‌క్షుడిగా-న‌రేష్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న‌ప్పుడు ఇలాంటి వివాదాలు త‌లెత్తిన‌ప్పుడు మా ఇలాగే స్పందించింది. చివ‌రిగా మీడియా క‌థ‌నాలే క‌రెక్ట్ అయ్యాయి గానీ, `మా ` వివ‌ర‌ణ‌ల్లో మాత్రం లోపాలు క‌నిపించాయి. ఈ నేప‌థ్యంలో `మా` అస‌లు నిజాలు చెప్పిందా? లేదా అన్న‌ది ఓ సందేహం. కార్య వ‌ర్గం స్పందించింది త‌ప్ప‌! అధ్య‌క్షుడు న‌రేష్ మాత్రం ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.