వర్మకు షాక్ ఇచ్చిన శివాజీ రాజా..!

టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పందించిన విషయం తెలిసిందే. ఎప్పటిలాగే తన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించిన వర్మ.. పూరీ జగన్నాథ్, సుబ్బరాజు లను విచారించినట్లు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న స్కూల్ పిల్లల్ని కూడా గంటల పాటు విచారిస్తారా అని సూటిగా ప్రశ్నించాడు. అంతేకాకుండా విచారణాధికారి అకున్ సబర్వాల్ ను మీడియా అమరేంద్ర బాహుబలిగా చూపిస్తోందని, అందుకే ఆయనను పెట్టి రాజమౌళి బాహుబలి-3 తీస్తే బాగుంటుందేమో అని వర్మ సెటైర్లు వేశాడు. దీంతో ఇప్పుడు డ్రగ్ మాఫియా లాంటి సీరియస్ ఇష్యూపై వర్మ ఇలా వ్యాఖ్యానించడంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీ రాజా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ సందర్బంగా వర్మ మాటల్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని శివాజీ రాజా స్పష్టం చేశారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకోకుండా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వల్ల ఒరిగేది ఏమీ లేదని, నోటీసులు అందుకున్న సెలబ్రిటీలకు విచారణ చేపడుతున్న అధికారులకు మాత్రమే అన్ని విషయాలూ తెలుసని శివాజీ రాజా అభిప్రాయపడ్డారు. అలాగే సిట్ విచారణ ద్వారా త్వరలోనే నిజానిజాలు వెల్లడవుతాయని, ఆలోపు ఎవరేం మాట్లాడినా అర్థం ఉండదని, అబద్ధాలు నిజాలు కావని, నిర్ధోషుల్ని దోషులుగా నిరూపించడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. ఇదే సమయంలో వర్మ ఇండస్ట్రీకి చేసిందేమీ లేదని, అతడి వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని శివాజీ రాజా తేల్చి చెప్పేశారు. చివరగా ఇండస్ట్రీలో మరింత మందికి నోటీసులు అందుతాయా లేదా అనే విషయంలో విచారణాధికారి అకున్ సబర్వాల్ మాత్రమే చెప్పగలరని పేర్కొన్నారు. ఏదిఏమైనా, వర్మను పట్టించుకోవాల్సిన పని లేదని డైరెక్ట్ గానే చెప్పేసి శివాజీ రాజా పెద్ద షాకే ఇచ్చారని అర్థమైపోతుంది.

Follow US