రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నటులు మృతి 

టీవీ రంగం ద్వారా నటులుగా ఇప్పుడిప్పుడే తమదైన ముద్ర వేస్తోన్న ఇద్దరు బుల్లితెర నటులు తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరం. ఆ యంగ్ యాక్టర్స్ గగన్ కాంగ్ (38), అర్జిత్ లావానియా (30) లు కావడం.. వాళ్ళు షూటింగ్ లో పాల్గొని తిరిగి వెళుతున్నప్పుడు ప్రమాదం జరగడం అందరినీ కలిచివేస్తోంది. ఇదిలా ఉంటే, సంకటమోచన్ మహాబలి హనుమాన్ సీరియల్ లో నటిస్తోన్న గగన్ కాంగ్, అర్జిత్ లావానియాలు ప్రస్తుతం మరో సీరియల్ ‘మహంకాళీ’ షూటింగ్ పనులతో కూడా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హనుమాన్ సీరియల్ తో పాపులర్ అయిన గగన్ ఇప్పుడు మహంకాళీ సీరియల్ లో ఇంద్రుడి పాత్ర పోషిస్తుండగా.. అతని సహా నటుడు అర్జిత్ నందిగా నటిస్తున్నాడని సమాచారం.
ఈ క్రమంలో నిన్నా మొన్నా ఏకధాటిగా భారీ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్న ఈ నటులిద్దరూ ఉదయం షూటింగ్ ముగించుకుని ముంబై బయలుదేరినట్లు సీరియల్ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అనంతరం వీరు ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇక ఈ దుర్ఘటన అహ్మదాబాద్ – ముంబై రహదారిపై పాల్ ఘార్ జిల్లాలోని మనోర్ వద్ద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రమాదానికి ముందు గగన్ కాంగ్ కారు నడుపుతుండగా, అర్జిత్ అతడి పక్క సీట్లో కూర్చున్నాడని.. కారు మనోర్ వద్దకు రాగానే కంటైనర్ ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారని వెల్లడించారు. దీంతో సీరియల్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనై తమ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ఏమైనా చిన్న వయస్సులోనే నటులిద్దరూ ఇలా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడం నిజంగా బాధాకరమే.