మ‌హాన‌టి రివ్యూ

Last Updated on by

రివ్యూ: మ‌హాన‌టి
న‌టీన‌టులు: కీర్తిసురేష్, దుల్క‌ర్ స‌ల్మాన్, స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: నాగ్ అశ్విన్

మ‌హాన‌టి.. కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. మూడున్న‌ర ద‌శాబ్ధాల కింద చ‌నిపోయిన సావిత్రి గారి జీవితంపై చేసిన సినిమా ఇది. దాంతో అంచ‌నాలతో పాటు ఆస‌క్తి కూడా అలాగే ఉంది ఈ చిత్రంపై. మ‌రి వాటిని నాగ్ అశ్విన్ అందుకున్నాడా..?

క‌థ‌:
సావ‌త్రి(కీర్తిసురేష్) చిన్న‌పుడే తండ్రిని కోల్పోతుంది. పెద‌నాన్న‌కేవీ చౌద‌రి (రాజేంద్ర‌ప్ర‌సాద్) ద‌గ్గ‌రే పెరుగుతుంది. నాటకాలంటే బాగా ఆస‌క్తి చూపించే సావిత్రిని తీసుకెళ్లి సినిమాల్లో ప‌రిచ‌యం చేయాల‌నుకుంటాడు చౌద‌రి. మ‌ద్రాస్ వ‌చ్చిన ఆమెను జెమినీ గ‌ణేష‌న్ (దుల్క‌ర్ స‌ల్మాన్) చూసి ఫోటోలు తీసి పంపిస్తాడు. ఆ త‌ర్వాత ఓ నిర్మాత సాయంతోఎల్వీ ప్ర‌సాద్ (అవ‌స‌రాల శ్రీ‌నివాస్) సంసారం సినిమాలో అవ‌కాశ‌మిస్తాడు. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదుగుతుంది సావిత్రి. ఆ క్ర‌మంలోనే జెమినీ గ‌ణేష‌న్, సావిత్రి పెళ్లి చేసుకుంటారు. ఈమె జీవితాన్ని క‌థ‌గా రాస్తూ నిజ‌మైన సావిత్రి గురించి ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌ని తాపత్ర‌య‌ప‌డుతుంది మ‌ధుర‌వాణి(స‌మంత‌). అస‌లు సావిత్రి జీవితం ఎలా మొద‌లై.. ఎలా ముగిసింది అనేది క‌థ‌..

క‌థ‌నం:
సావిత్రి జీవితం అంటే అంచ‌నాలు చాలా ఉంటాయి. పైగా ఈ తరానికి ఆమె గురించి ఏమీ తెలియ‌దు. అప్ప‌ట్లో ఆమె తాగుడుకు బానిసై చ‌నిపోయింద‌ట అని మాత్ర‌మే తెలుసు. కానీ ఎందుకు తాగాల్సి వ‌చ్చింది.. అంత‌గా ఎదిగిన న‌టి.. ఇంత‌గా ఎందుకు దిగ‌జారిపోయింది అని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించాడు నాగ్ అశ్విన్. ఒకే ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడి నుంచి ఇంత‌టి ఔట్ పుట్ రావ‌డం మాత్రం నిజంగా అద్భుత‌మే. స్క్రీన్ ప్లేతోనే మాయ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. తొలి సీన్ లోనే హాస్పిట‌ల్ లో దిక్కులేని మ‌నిషిలా అంత‌టి మ‌హాన‌టిని చూపించి.. ఆమె జీవితం ఎలా ముగుస్తుందో ముందే చెప్పాడు నాగ్. ఆ త‌ర్వాత మెల్ల‌గా ఒక్కో పాత్ర‌తో ఆమె జీవితంలోకి వెళ్లాడు. ఆ స్క్రీన్ ప్లేనే సినిమాకు అందాన్ని తీసుకొచ్చింది. మ‌ధ్య మ‌ధ్య‌లో క‌థ‌లోకి వ‌చ్చే పాత్ర‌లు సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచేస్తాయి.

సావిత్రి గారి జీవితంలో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి. ఆమె జీవితంలోని చీక‌ట్ల‌న్నింటినీ బాగానే చూపించాడు ద‌ర్శ‌కుడు. చిన్న‌నాటి నుంచి పెరిగేంత వ‌ర‌కు.. కెరీర్ లో ఎదిగేంత వ‌ర‌కు అన్నీ చూపించిన ద‌ర్శ‌కుడు.. ఆమె జీవితాన్ని కూడా సున్నితంగా స్పృషించాడు. జెమినీ గ‌ణేష‌న్ తో ఆమె ప్రేమ‌లో ప‌డ‌టం.. ఆ త‌ర్వాత అత‌డితో విభేధాలు.. విడిపోవ‌డం.. చివ‌ర్లో మందుకు బానిస కావ‌డం ఇవ‌న్నీ చూస్తుంటే మ‌నం దేవ‌త‌గా చూసే మ‌నిషేనా పాపం ఇన్ని క‌ష్టాలు ప‌డింది అంటూ మ‌న‌సు బ‌రువెక్క‌డం ఖాయం. ఇక ఆమెలోని వ్య‌క్తిత్వాన్ని.. అమ్మ లాంటి దాతృత్వాన్ని కూడా అలాగే చూపించాడు ద‌ర్శ‌కుడు. చివ‌రికి ఆమె సాయం చేసిన వాళ్లు కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం నిజంగా శోచ‌నీయం. ఆమె కూడా ఆత్మ‌గౌర‌వాన్ని నింపుకుని సాయం కోసం వేచి చూడ‌కుండా అలాగే చ‌నిపోవ‌డం ఆమె గొప్ప‌తనానికి నిద‌ర్శ‌నం.

న‌టీన‌టులు:
సావిత్రి లాంటి మ‌హాన‌టి బ‌యోపిక్ తీయాల‌ని ఆలోచ‌న వ‌చ్చిన‌పుడు.. ఆమె పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు.. అంత గొప్ప న‌టి ఎవ‌రున్నారు అనే అనుమానం అంద‌రికీ వ‌స్తుంది. దానికి నేనున్నానంటూ పూర్తిస్థాయి న్యాయం చేసింది కీర్తిసురేష్. సావిత్రి అంత గొప్ప‌గా న‌టించ‌లేదేమో కానీ.. ఆమె హావ‌భావాల‌ను మాత్రం అచ్చంగా దించేసింది. నిజంగా సావిత్రి ఇలాగే న‌టించేదేమో అనేంత‌గా మారిపోయింది. ఇక జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా ఒదిగిపోయాడు. ఆయ‌న పాత్ర‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. హీరో ఛాయ‌లు ఉన్న విల‌న్ అత‌డు. ప్రేమ ఓకే.. పెళ్లి కాదు అనే భావ‌జాలం ఉన్న పాత్ర అది. అందులో చ‌క్క‌గా న‌టించాడు దుల్క‌ర్. స‌మంత జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో మెప్పించింది. క్లైమాక్స్ లో ఆమె న‌ట‌న అద్భుతం. విజయ్ దేవ‌రకొండ బాగా చేసాడు. ప్ర‌కాశ్ రాజ్.. క్రిష్.. త‌రుణ్ భాస్క‌ర్.. సందీప్ రెడ్డి వంగా.. నాగ‌చైత‌న్య‌.. మోహ‌న్ బాబు.. రాజేంద్ర ప్ర‌సాద్.. ఇలా ఒక్క‌రేంటి సినిమాలో ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ పాత్ర‌ల‌కు ప్రాణం పోసారు.

టెక్నిక‌ల్ టీం:
మ‌హాన‌టికి అతిపెద్ద ప్ల‌స్ మిక్కీ జే మేయ‌ర్ సంగీతం. పాట‌లే కాదు.. ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు మిక్కీ. ఇక డాని సినిమాటోగ్ర‌ఫీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా విజువ‌ల్స్ బాగా కుదిరాయి. సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు అద్భుతంగా కుదిరాయి. ఆడ‌వాళ్ళ ఏడుపు ప్ర‌పంచ‌మంతా చూస్తుంది.. మ‌గాళ్ల ఏడుపు మాత్రం మందు గ్లాసు మాత్ర‌మే చూస్తుంది అనే ఛ‌లోక్తులు కూడా బాగా రాసాడు బుర్రా. ఇక నాగ్ అశ్విన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేనేమో..! 30 ఏళ్లు కూడా స‌రిగ్గా లేని ఈ కుర్రాడు సావిత్రిని ఇంత బాగా ఎలా అర్థం చేసుకున్నాడ‌బ్బా అనిపిస్తుంది సినిమా చూసిన త‌ర్వాత‌. అంత అద్భుతంగా తెర‌కెక్కించాడు.

చివ‌ర‌గా:
మ‌హాన‌టి.. ఇది చిత్రం కాదు.. ఓ జ్ఞాప‌కం..

రేటింగ్: 3.25/5.0

User Comments