2021లో మ‌హేష్‌- రాజ‌మౌళి కాంబో

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌- ఎస్.ఎస్.రాజ‌మౌళి కాంబినేష‌న్ మూవీ సెట్స్ పైకి వెళ్లేదెప్పుడు? అంటే అది ఇంత‌కాలం స‌స్పెన్స్ గానే మిగిలింది. అయితే అందుకు ముహూర్తం 2021లో కుదిరే వీలుంద‌ని మ‌హేష్ ఓ హింటివ్వ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. నేడు హైద‌రాబాద్ లో జ‌రిగిన మ‌హ‌ర్షి ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ మాట్లాడుతూ రాజ‌మౌళితో ప్రాజెక్ట్ గురించి మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చారు.

“రాజ‌మౌళి గారితో సినిమా చేయాల‌ని అనుకున్నాను. కె.ఎల్‌.నారాయ‌ణ ఆ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ రాజ‌మౌళి క‌మిట్‌మెంట్స్.. నా క‌మిట్ మెంట్స్ పూర్త‌య్యాక క‌లిసి చేయాల‌ని భావించాం“ అని హింట్ ఇచ్చారు మ‌హేష్‌. రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఒకే ఒక్క క‌మిట్ మెంట్ ఇచ్చారు. అది చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ – దాన‌య్య‌ల‌తో క‌లిసి చేస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా పూర్త‌య్యాక బ‌హుశా మ‌హేష్ తో ఫిక్స‌యిన‌ట్టేన‌ని భావించ‌వ‌చ్చు. 30 జూలై 2020న ఆర్.ఆర్.ఆర్ రిలీజ‌వుతుంది. అంటే అప్ప‌టి నుంచి రాజ‌మౌళి- విజ‌యేంద్ర ప్ర‌సాద్ బృందం మ‌హేష్ సినిమాపై దృష్టి సారిస్తారు. ఎట్టి ప‌రిస్థితిలో 2021 నాటికి అన్నిటినీ సిద్ధం చేసి సెట్స్ కెళ్లే వీలుంద‌ని తాజా ప‌రిణామాన్ని అంచ‌నా వేస్తున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టించాల‌న్న‌ది ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల ఆకాంక్ష‌. అందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్టేన‌ని భావిస్తున్నారంతా. ఇక రాజ‌మౌళితో పాటు త్రివిక్ర‌మ్ తో..స్క్రిప్టు చ‌ర్చించాన‌ని అది కూడా పాజిటివ్ గానే ఉంద‌ని మ‌హేష్ తెలిపారు. అలాగే సుకుమార్ తోనూ క‌మిట్ మెంట్ పూర్త‌య్యాక సినిమా చేసే ఆలోచ‌న ఉంద‌ని రివీల్ చేశారు.