కేర‌ళ‌కు మ‌హేష్ 25ల‌క్ష‌లు

కేర‌ళ‌ను వ‌ర‌ద‌లు అత‌లాకుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ పెనువిల‌యం నేప‌థ్యంలో 14 జిల్లాల్లో దారుణాతి దారుణ‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వంద‌లాది జ‌నం చ‌నిపోయారు. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యులయ్యారు. వాగులు వంక‌లు పొంగి పొర్లి ఊర్ల మీదికొచ్చేస్తున్నాయ్‌. ఇదంతా గుండెల్లో గోదారి సినిమానే త‌ల‌పిస్తోంది. ఇలాంటి సంద‌ర్భంలో ఇరుగుపొరుగు స్పంద‌న అంతే బావుంది. క‌ష్టంలో ఉన్న‌వారిని ఆదుకునేందుకు సెల‌బ్రిటీలంతా ముందుకొచ్చారు. అల్లు అర్జున్‌, ప్ర‌భాస్ వంటి స్టార్లు చాలా ముందుగా స్పందిస్తే, ఈ శ‌నివారం నాడు మెగాస్టార్ కుటుంబం 51ల‌క్ష‌లు ప్ర‌క‌టించింది.

ఇప్పుడు మ‌హేష్ వంతు. కేర‌ళ‌లో ధైన్య‌మైన ప‌రిస్థితికి చ‌లించిపోతున్నాను అంటూ మ‌హేష్ 25ల‌క్ష‌ల డొనేష‌న్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి ప్ర‌క‌టించారు. మూవీ ఆర్టిస్టుల సంఘం నిన్నటి సాయంత్రం మీడియా ముఖంగా 10ల‌క్ష‌ల డొనేష‌న్‌ని ప్ర‌క‌టించింది. కేర‌ళ న‌టీన‌టుల సంఘం `అమ్మ‌` 10ల‌క్ష‌లు డొనేట్ చేసింది. కోలీవుడ్ నుంచి ల‌క్ష‌ల్లో విరాళాలు వెల్లువెత్తాయి. మొత్తం మీద ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల నుంచి దాదాపు 3కోట్లు పైగానే సీఎం రిలీఫ్ పండ్‌కి చేరుకుంటే, మ‌న ప‌రిశ్ర‌మ నుంచి 2కోట్ల వ‌ర‌కూ సీఎం రిలీఫ్ ఫండ్‌కి చేరే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప‌లువురు టాలీవుడ్ న‌టీన‌టులు నిత్యావ‌సార వ‌స్తువులు, బ‌ట్ట‌లు వంటి వాటిని స‌మీక‌రించి కేర‌ళ‌కు పంపే ఆలోచ‌న చేస్తున్నారు. ఆర్టిస్టులంతా సాయానికి ముందుకు రావాల్సిందిగా మా అసోసియేష‌న్ కోరింది కాబ‌ట్టి ఆ మేర‌కు సాయం పెర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.