మోడీ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన మహేష్ బాబు

ప్రధాని నరేంద్ర మోడీ రీసెంట్ గా మన సౌత్ సూపర్ స్టార్లను టార్గెట్ చేశారనే న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసే ఉంటుంది. అదేనండి, స్వచ్ఛ భారత్ విషయంలో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి లాంటి స్టార్స్ కు మోడీ లేఖలు రాసి అందులో ఓ భాగం కావాలని కోరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రజినీకాంత్, రాజమౌళిలు ఇప్పటికే తమకు మోడీ లేఖలు పంపడం నిజమేనని, తప్పకుండా మా వంతు కృషి చేస్తామని చెప్పడం విశేషం.

ఇక ఈ లిస్టులో ఉన్న మహేష్ బాబును తాజాగా ఈ విషయంపై స్పందించమంటే.. తనకు అసలు మోడీ నుంచి ఏ లేఖా రాలేదంటూ షాక్ ఇచ్చాడు. అంతేకాకుండా అది కేవలం రూమర్ మాత్రమేనని సింపుల్ గా తేల్చిపారేశాడు. మరి అలాంటప్పుడు మహేష్ పేరు ఈ లిస్టులోకి ఎలా వచ్చిందనే డౌట్ రావడం సహజం. అందుకే మహేష్ కూడా తనకు రాజకీయాలు ఎక్కడ అంటగడతారేమోనని ముందుగానే నమస్కారం పెట్టేశాడు. ముఖ్యంగా రాజకీయాలు తనకు పడవని డైరెక్ట్ గానే చెప్పేసిన మహేష్.. అయితే బయట ఏం జరుగుతుందోనని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తానని అన్నాడు.

ఇదే సమయంలో తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని, అవసరం అనుకుంటే తాను కూడా ఆ గ్రామాల్ని సందర్శిస్తానని మహేష్ పేర్కొన్నాడు. చివరగా ఈ గ్రామాల్ని మంచి స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపాడు. దీంతో మొత్తంగా సినిమాలు, ఫ్యామిలీ, దత్తత గ్రామాలు, బయట ఏ జరుగుతుందో తెలుసుకోవడం తప్ప తనకు ఇంకేం విషయాల్లో సంబంధం లేదని మహేష్ సరదాగా వ్యాఖ్యానించినట్లు అయింది. మరి మోడీ ఇప్పుడైనా స్వచ్ఛ భారత్ విషయంలో ఓ లేఖ పంపిస్తే దానిని కూడా మహేష్ బాధ్యతగా తన డైరీలో చేర్చుకుంటాడేమో చూడాలి.