మ‌న సిఎం కు అక్కడ ఏం పని

Last Updated on by

మ‌న సిఎం అంటే ఏ కేసీఆరో.. చంద్ర‌బాబునాయుడో అనుకోవ‌ద్దు. ఇక్క‌డ సిఎం అంటే భ‌ర‌త్.. మ‌న మహేష్ బాబు. ఈయ‌న ఆ పాత్ర‌లోంచి బ‌య‌టికి వ‌చ్చి మ‌రో సినిమా మొద‌లుపెట్టినా కూడా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు మాత్రం మహేష్ ను ముఖ్య‌మంత్రి పాత్ర‌లోనే చూస్తున్నారు. ఇప్పుడు ఈయ‌న కొత్త సినిమా మొద‌లు పెట్టాడు. ఇన్నాళ్లూ ఇప్పుడు అప్పుడూ అంటూ వాయిదా ప‌డుతున్న వంశీ పైడిప‌ల్లి సినిమా డెహ్రాడూన్ లో మొద‌లైంది. దిల్ రాజు కూడా మహేష్ వెంటే ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ జూన్ 18న మొద‌లైంది. అక్క‌డే కొన్ని రోజులు జ‌ర‌గ‌నుంది.

స‌మ్మ‌ర్ హీట్ ఇంకా త‌గ్గ‌లేదు కాబ‌ట్టే అక్క‌డ హిల్ స్టేష‌న్ లో తొలి షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు. ఇక ఇందులో పూజాహెగ్డే, అల్ల‌రి న‌రేష్ కూడా పాల్గొంటారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఈ షెడ్యూల్ తొలిరోజే అక్క‌డ ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ ను క‌లిసాడు సూప‌ర్ స్టార్. షూటింగ్ అక్క‌డే జ‌రుగుతుండ‌టంతో ఆయ‌న్ని క‌ల‌వ‌డానికి ముఖ్య‌మంత్రి వ‌చ్చారు. మొత్తానికి అలా మ‌న సినిమా ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌డానికి నిజ‌మైన ముఖ్య‌మంత్రి వ‌చ్చారు. ఈ సినిమా డిసెంబ‌ర్ లోపు పూర్తి కావాల‌ని కండీష‌న్ పెట్టాడు మహేష్. సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నేది ప్లాన్.

User Comments