మ‌హ‌ర్షి బ‌డ్జెట్ 140 కోట్లు..ప్రీ రిలీజ్ 120 కోట్లా?

mahesh babu maharshi

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా వంశీపైడిప‌ల్లి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన `మ‌హ‌ర్షి` మే 9న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. మ‌హేష్ కు ల్యాండ్ మార్క్ మూవీ కావ‌డంతో దిల్ రాజు, అశ్నీని ద‌త్, పీవీపీలు భారీ బ‌డ్జెట్ తోనే నిర్మించార‌ని మొద‌టి నుంచి ప్ర‌చారంలో ఉంది. అయితే ప‌క్కాగా బ‌డ్జెట్ ఫిగ‌ర్ ఎంత‌న్న‌ది తెలియలేదు. తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివ‌రాలు లీక‌వ్వ‌డంతో బ‌డ్జెట్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మ‌హ‌ర్షి బ‌డ్జెట్ 140 కోట్లు అని స‌మాచారం. మ‌హేష్ స్టార్ డ‌మ్ పై న‌మ్మ‌కంతోనే నిర్మాత‌లు బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. దానికి తోడు వంశీ పైడిప‌ల్లి సినిమాలంటే సెట్స్ కు వెళ్ల‌క ముందు బ‌డ్జెట్ వేరుగా ఉంటుంది. వెళ్లిన త‌ర్వాత మ‌రోలా ఉంటుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు.

షూటింగ్ ప్రారంభ‌మైన త‌ర్వాత అనూహ్యంగా రిచ్ లుక్ కోసం బ‌డ్జెట్ పెంచుకుంటూ పోతార‌నే ఓ విమ‌ర్శ ఉంది. ఈ కోణంలోనే మ‌హ‌ర్షి బ‌డ్జెట్ త‌డిపి మోపుడై 140 కోట్ల‌కు చేరింద‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో ముచ్చ‌టించుకుంటున్నారు. ఇక మ‌హేష్ గ‌త సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద 150 నుంచి 180 కోట్ల మ‌ధ్య‌లోనే వ‌సూళ్లు సాధించాయి. `శ్రీమంతుడు` 150 కోట్లు సాధించ‌గా, `భ‌ర‌త్ అనే నేను` 180 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. మ‌హేష్ కెరీర్ లో ఈ రెండు భారీ వ‌సూళ్ల చిత్రాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడా రికార్డును మ‌హ‌ర్షి క‌చ్చితంగా బ్రేక్ చేస్తేనే సేఫ్ జోన్ కు వెళ్లిన‌ట్లు. మ‌హ‌ర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్లు చేసింద‌ని చెబుతున్నారు.

అంటే 20 కోట్ల‌కు పైగా డఫ్ షీట్ లో సినిమా విడుద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. డిజిట‌ల్, శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ భారీ మొత్తంలో బిజినెస్ జ‌రుగుతుంది. ఆ ర‌కంగా నిర్మాత‌లు సేఫ్ జోన్ లో ఉన్నా? మ‌హేష్ ఇమేజ్ కే ఇక్క‌డ‌ అగ్ని ప‌రీక్ష‌. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది మ‌హేష్‌కు క‌త్తిమీద సాములాంటిదే. సినిమా ఫ‌స్ట్ డే హిట్ టాక్ తెచ్చుకుంటే బ్రేక్ ఈవెన్ సాధ్యం. ఆ పై బ్లాక్ బ‌స్ట‌ర్ అంటేనే వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం ఉంది. లేదంటే రిస్క్ లో ప‌డిన‌ట్లే. మ‌హేష్ సినిమాల‌కు యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా థియేట‌ర్ వైపు చూసే జ‌నాలు అంత‌గా ఉండ‌రని గ‌త సినిమా అనుభ‌వాలు చెబుతున్నాయి. మ‌రి మే 9న మ‌హేష్ ఏం చేస్తాడో చూద్దాం.