వావ్.. 18 ఏళ్ళ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్లు

 

టాలీవుడ్ సూపర్ స్టార్ అంటే ఇప్పుడందరూ మహేష్ బాబు పేరే చెబుతారు. కానీ ఒకప్పుడు ఆ పేరుతో ఎన్నో రికార్డులు సృష్టించి, టాలీవుడ్ చరిత్రలో చెరగని ముద్రను వేశారు ఘట్టమనేని కృష్ణ. ఆ సూపర్ స్టార్ వారసుడిగానే తెరంగేట్రం చేసిన మహేష్ బాబు కూడా తనదైన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదగడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇదిలా ఉంటే, హీరోగా అలరించడానికి ముందే మహేష్.. కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117 వంటి సినిమాల్లో బాలనటుడిగా నటించి మెప్పించిన విషయం అందరికీ తెలుసు. అవన్నీ కూడా సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే కావడం గమనార్హం.
ఇక ఆ తర్వాత కృష్ణ గారు కూడా మహేష్ హీరోగా మారాక రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ సినిమాల్లో అతిథి పాత్రలో మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది. అనంతరం సూపర్ స్టార్లయిన ఈ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి నటించకపోవడం బాధాకరం. అయితే, ఇప్పుడు ఈ సూపర్ స్టార్స్ ఇద్దర్నీ తిరిగి ఒకేసారి తెరపై చూడబోతున్నామని తెలియడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. అది కూడా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మహేష్ లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’ కారణంగా కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అసలు విషయంలోకి వెళితే, ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కృష్ణ గారు రీసెంట్ గా కొరటాల శివ కోరిక మేరకు మహేష్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించడానికి ఓకే చెప్పారని తెలియడం విశేషం. దీంతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు కాబట్టి.. అదే టైమ్ లో ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా కృష్ణ గారు కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. దీంతో 18 ఏళ్ళ తర్వాత తిరిగి సూపర్ స్టార్ కృష్ణ – మహేష్ బాబు ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారని ఫ్యాన్స్ అప్పుడే పండుగ చేసేసుకుంటున్నారు. మరి ఈ విషయంలో నిజంగా సూపర్ స్టార్లు కలిసి తెరపై ఒకేసారి కనిపిస్తే .. డైరెక్టర్ కొరటాల శివకు అందరూ థాంక్స్ చెప్పాల్సిందే.