మ‌హేశ్ కావాల‌నే ఎదురెళ్తున్నాడా..?

స్పైడ‌ర్ ప్లాప్ త‌ర్వాత మ‌హేశ్ లో కాస్త నిరుత్సాహం క‌నిపిస్తుంది. ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సి క‌నిపిస్తుంది. త‌న తోటి హీరోలంతా వ‌ర‌స‌గా హిట్లు అందుకుంటుంటే.. మ‌హేశ్ మాత్రం దిక్కులు చూస్తున్నాడు. ఈయ‌న గ‌త ఐదు సినిమాల్లో నాలుగు డిజాస్ట‌ర్లు ఉన్నాయి. ఇదే సూప‌ర్ స్టార్ ను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. స్పైడ‌ర్ అయితే మ‌రీ దారుణం. బ్ర‌హ్మోత్స‌వం కంటే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది ఈ చిత్రం. దాంతో ఇప్పుడు ఈ హీరో ఆశ‌ల‌న్నీ భ‌ర‌త్ అనే నేను పైనే ఉన్నాయి. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఎప్రిల్ 27న విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే అదే రోజు బ‌న్నీ కూడా వ‌స్తానంటున్నాడు. ఈ విడుద‌ల తేదీ ఎప్పుడో అనౌన్స్ చేసారు నా పేరు సూర్య ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే చెప్పిన‌ట్లుగా ఎప్రిల్ 27న రానున్నాడు బ‌న్నీ. ఇదే జ‌రిగితే అల్లుఅర్జున్, మ‌హేశ్ మ‌ధ్య పెద్ద యుద్ధం జ‌ర‌గ‌డం ఖాయం.
శ్రీ‌మంతుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత కొర‌టాలతో మ‌హేశ్ చేస్తోన్న సినిమా కావ‌డంతో భ‌ర‌త్ అనే నేను పై ఇండ‌స్ట్రీలోనే కాదు.. అభిమానుల్లోనూ అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో మ‌హేశ్ ముఖ్య‌మంత్రిగా న‌టిస్తున్నాడు. ఇదే సినిమాకు హైలైట్ పాయింట్. ఇప్ప‌టి వ‌ర‌కు సూప‌ర్ స్టార్ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలో న‌టించ‌లేదు. కానీ తొలిసారి అది చేస్తుండ‌టంతో ఆ సిఎం ఎలా ఉంటాడా అని ఇండ‌స్ట్రీ కూడా వేచి చూస్తుంది. ఇక బ‌న్నీ నా పేరు సూర్య‌పై కూడా భారీ అంచ‌నాలున్నాయి. దీనికి కార‌ణం బ‌న్నీ ట్రాక్ రికార్డ్. డిజే లాంటి యావ‌రేజ్ సినిమాతో కూడా 70 కోట్ల షేర్ తీసుకొచ్చాడు బన్నీ. అంటే ప‌రిస్థితులు మ‌నోడికి ఎంత అనుకూలంగా ఉన్నాయో తెలుస్తుంది. పైగా స‌మ్మ‌ర్ కు ద‌త్త‌పుత్రుడు బ‌న్నీ. ఇలాంటి టైమ్ లో అల్లుఅర్జున్ తో పోటీ అంటే మ‌హేశ్ కు కాస్త రిస్కే. కానీ ఇదే టైమ్ లో మ‌హేశ్ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే మాత్రం అప్పుడు క‌చ్చితంగా బ‌న్నీకి రిస్క్. మ‌రి ఈ ఇద్ద‌రి పోరులో ఎవ‌రిని విజయం వ‌రిస్తుందో..?