ఎంబి ప్రొడ‌క్ష‌న్స్ బిగ్ ప్లాన్‌

Last Updated on by

అగ్ర నిర్మాణ సంస్థ‌లు టైఅప్‌ల‌తో వ‌రుస‌గా చిన్న సినిమాలు నిర్మిస్తూ పెద్ద స‌క్స‌స్‌ని అందుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫార్ములా పెద్ద రేంజులో వ‌ర్క‌వుట్ అవుతుండ‌డంతో ఈ త‌ర‌హా ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాలు నిర్మించేందుకు ప‌లువురు స్టార్ హీరోలు సొంతంగా బ్యాన‌ర్లు ప్రారంభించి కొత్త ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ వంటి సంస్థలు ఈ త‌ర‌హాలో చిన్న సినిమాలు నిర్మిస్తూ విజ‌యాలు అందుకోవ‌డం తెలిసిందే. వ‌రుస హ్యాట్రిక్‌ల‌తో సంచ‌ల‌న విజ‌యాల‌తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఇత‌ర బ్యాన‌ర్ల‌ను క‌లుపుకుని చిన్న సినిమాలు తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి అగ్ర‌నిర్మాణ సంస్థ ప్ర‌తిభావంతుల్ని క‌లుపుకుని పోతూ చిన్న బ‌డ్జెట్ సినిమాలు తీస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇక‌పై కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై చిన్న సినిమాల నిర్మాణానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ బ్యాన‌ర్‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాలు తెర‌కెక్కించేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది. అదే దారిలో ఇప్పుడు బ‌న్ని సైతం సొంతంగా బ్యాన‌ర్ ప్రారంభించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. సూపర్‌స్టార్ మ‌హేష్ – న‌మ్ర‌త జంట ఇదివ‌ర‌కూ ఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ని ప్రారంభించి పెట్టుబ‌డులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ్యాన‌ర్‌లోనూ ఇక‌పై చిన్న బ‌డ్జెట్ చిత్రాలు నిర్మించ‌నున్నార‌ని తెలుస్తోంది. అందుకోసం ఎంబి అఫీషియ‌ల్ టీమ్ పేరుతో ఓ యంగ్ ట్యాలెంటెడ్ టీమ్‌ను రెడీ చేశార‌ట‌. కుమారి 21 ఎఫ్‌, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఆర్ఎక్స్ 100 వంటి చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించ‌డం ఈ త‌ర‌హా ఆలోచ‌న‌ల‌కు ఊత‌మిస్తోంద‌ని భావించ‌వ‌చ్చు.

User Comments