అందుకే మ‌హేశ్ కు త‌మిళ్ పై మోజు..

చూస్తుండ‌గానే రోజులు గ‌డిచిపోతున్నాయి. స్పైడ‌ర్ మ‌రో ఐదు రోజుల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అందుకే ప్ర‌మోష‌న్ లో జోరు పెంచారు చిత్ర‌యూనిట్. మహేశ్ బాబు-మురుగదాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన స్పైడ‌ర్ సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది స్పైడ‌ర్. దీనికి పాజిటివ్ టాక్ వ‌చ్చింది.
తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి వ‌స్తుండ‌టంతో రెండింటికీ కామ‌న్ గా ఉండేలా స్పైడ‌ర్ టైటిల్ పెట్టాడు ద‌ర్శ‌కుడు. మ‌రోవైపు త‌మిళ‌నాట మాత్రం మ‌హేశ్ సినిమా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అక్క‌డి మీడియాలో.. ఫిల్మ్ మ్యాగజైన్స్ లో మ‌న మ‌హేశ్ సినిమా గురించి తెగ రాస్తున్నారు. ఈ సినిమాతో త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ పాగా వేయ‌డం గ్యారెంటీ అంటూ రాస్తున్నారు సినీ విమ‌ర్శ‌కులు. ఇక ఇప్పుడు త‌మిళ మార్కెట్ ను క్యాష్ చేసుకోడానికి చెన్నైలోనే రెండు మూడు రోజులు మ‌కాం వేస్తున్నాడు మ‌హేశ్. అక్క‌డే ఉండి లోక‌ల్ మీడియాతో పాటు గేమ్ షోస్.. టీవీ షోల‌కు కూడా వెళ్ల‌బోతున్నాడు సూప‌ర్ స్టార్. త‌మిళ ప్రేక్ష‌కుల‌కు తాను వీలైనంత వ‌ర‌కు చేరువ కావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు సూప‌ర్ స్టార్.
త‌మిళ్ తో పోలిస్తే తెలుగులో స్పైడ‌ర్ సినిమాకు అంత ప్ర‌మోష‌న్ చేయ‌ట్లేదు. ఇక్క‌డ అవ‌స‌రం లేదు కూడా. ఎందుకంటే మ‌హేశ్ ఇక్క‌డ సూప‌ర్ స్టార్. త‌న సినిమాల‌కు ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్ అక్క‌ర్లేదు. మ‌హేశ్ అనే పేరు ఇక్క‌డ ఆయుధం. అభిమానులే ఈ చిత్రాన్ని భుజాల‌పై మోస్తారు. పాజిటివ్ టాక్ వ‌స్తే బాక్సాఫీస్ ను కుమ్మేయ‌డం ఖాయం. కానీ త‌మిళ‌నాట అలా కాదు. అక్క‌డ క‌చ్చితంగా సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లాలంటే ప్ర‌మోష‌న్ త‌ప్ప‌నిస‌రి. అందుకే ఆ మ‌ధ్య ఆడియో వేడుకను కూడా భారీగా చేసారు.
ఈ చిత్రాన్ని లైకా సంస్థ 20 కోట్లకు కొన్నారు త‌మిళ్లో. తెలుగు సినిమాల‌కు బాహుబ‌లి త‌ర్వాత ఇదే అత్య‌ధికం. కేవ‌లం మురుగ‌దాస్ మార్కెట్ ను చూసి స్పైడ‌ర్ ను భారీ రేట్ కు కొనేస్తున్నారు. ఇది హిట్టైతే త‌మిళ నాట మ‌హేశ్ బాబుకి మార్కెట్ ఓపెన్ అయిన‌ట్లే. మ‌రి చూడాలిక‌.. త‌మిళ నేల‌పై మ‌హేశ్ ఎలాంటి మాయ చేయ‌బోతున్నాడో..?