లైఫ్ ట్రిగ్గర్‌లోంచే `మజిలీ`! -శివ నిర్వాణ

‘నిన్నుకోరి’తో సూపర్‌హిట్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ. అక్కినేని నాగచైతన్య – సమంత – దివ్యాంశ కౌశిక్ తారాగణంగా మజిలీ చిత్రాన్ని తెరకెక్కించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ చిట్‌చాట్ ఇది.

‘మజిలీ’ జర్నీ ఎలా మొదలైంది? అంటే నా తొలి చిత్రం `నిన్ను కోరి` అందరికీ నచ్చింది. మంచి సినిమా తీశావు అని ప్రశంసించారు. వ‌రుస‌గా ఒకే జోనర్‌లో సినిమాలు తీయడం ఇష్టం ఉండదు. జోనర్ మారుద్దామని రెండు కథలు రెడీ చేసుకొన్నా.. హీరోల కాల్షీట్లు క్లాష్ వస్తుండడంతో అవి వర్కవుట్ అవ్వలేదు. ఆ టైమ్‌లో నాగ చైతన్య నాకు ఫోన్ చేసి `నిన్నుకోరి` నచ్చింది. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ ఉంటే తీసుకురా.. మనం కలిసి సినిమా చేద్దామని అన్నారు. అప్ప‌టికి క‌థ లేదు. 20 రోజుల తర్వాత నాకు ఓ ఐడియా ఫ్లాష్ అయింది. చైతన్యని 19 ఏళ్ల‌ కుర్రాడిలా చూపించగలం, అలానే 34 ఏళ్ల న‌డివ‌య‌స్కుడి చూపించగలం. అదే నాకు ప్ల‌స్.. మ‌న గ‌తంలో తీసుకెళ్ళే సినిమాలు చేయ‌డం ఇష్టం. అలాగే క్రికెట్, లవ్, మ్యారేజ్ ఈ మూడు ఎలిమెంట్స్ తీసుకొని ఒక మిడిల్ క్లాస్ డ్రామాతో చేయాల‌నుకున్నా. అలా మజిలీ మొదలైంది.

అలాగే నా చిత్రాల్లో రియల్ లైఫ్ ఘటనలు తప్పనసరి. అవి నా ఇంటర్ రోజుల్లో జరిగినవి అయినా….. లేదా నేను స్వయంగా అనుభవించినవి కావొచ్చు.. నాలో ఇంకిపోయిన అనుభ‌వాలు స‌న్నివేశాల‌వుతాయి. ఏదయితే నాకు గట్టిగా ట్రిగ్గర్ అవుతుందో దానిని సినిమాలో రాస్తాను. ఒక సీన్ రాయడం వేరు! అదే సీన్‌ను జీవితంలో నుండి చూసి రాస్తే ఇచ్చే కిక్కు వేరుగా ఉంటాయి.. అని తెలిపారు. రెండో సినిమా సిండ్రోమ్ .. టెన్షన్ లేదా? అని ప్ర‌శ్నిస్తే.. దాని గురించి నేను కూడా విన్నాను. అయితే నా మొదటి సినిమా ‘నిన్నుకోరి’ కంటే ఎక్కువ కష్టపడి ఈ కథ రాశాను. కాబట్టి ఫెయిల్యూర్ కి ఛాన్సే లేద‌ని తెలిపారు. టైటిల్ జస్టిఫికేషన్ ? గురించి మాట్లాడుతూ.. మన సుదూర ప్రయాణంలో మధ్యలో సేద తీరే పాయింట్‌ని మజిలీ అని అంటారు. అలానే పరుగెడుతున్న ఒక మనిషి జీవితంలో తనని ఆపి, గైడ్ చేసి కొంత సేదతీర్చే పాయింట్ పెళ్లి. అదే కాన్సెప్టుతో ఈ టైటిల్ ఎంచుకున్నాం… అన్నారు. త‌దుప‌రి ఓ రెండు క‌థ‌లు రెడీ అవుతున్నాయి. వాటిలో ఒక‌టి యాక్ష‌న్ జోన‌ర్ సినిమా అని శివ తెలిపారు.