అదిరిపోయిన ఓట‌ర్.. విష్ణు అదుర్స్..

కొన్ని సినిమాలు మొద‌లుపెట్టిన‌పుడు ఎలాంటి అంచ‌నాలు ఉండ‌వు.. షూటింగ్ పూర్తి చేసుకున్న త‌ర్వాత కూడా పెద్ద‌గా క్రేజ్ ఉండ‌దు. ఒక్క లుక్ కానీ.. టీజ‌ర్ కానీ వ‌చ్చిందంటే దృష్టంతా ఆ సినిమాల వైపు వెళ్లిపోతుంది. విష్ణు న‌టిస్తోన్న ఓట‌ర్ కూడా ఈ లిస్ట్ లోకే వ‌స్తుంది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు విష్ణు ఓట‌ర్ అనే ఓ సినిమా చేస్తున్నాడ‌నే విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు. కానీ ఇప్పుడు ఒక్క లుక్ తో త‌న సినిమాపై ఆస‌క్తి పెంచేస్తున్నాడు మంచు వార‌బ్బాయి. కొత్త ద‌ర్శ‌కుడు కార్తిక్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ నవంబ‌ర్ 22న విడుద‌లైంది. మంచు విష్ణు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

తెలుగు, త‌మిళ భాషల్లో ఒకేసారి తెర‌కెక్కుతోంది ఓట‌ర్. దానికి త‌గ్గ‌ట్లే ఫ‌స్ట్ లుక్ కూడా డిజైన్ చేసారు. త‌మిళ వ‌ర్ష‌న్ కు అక్క‌డి రాజ‌కీయ నేత‌ల ఫోటోలు.. తెలుగు వ‌ర్ష‌న్ కు ఇక్క‌డి రాజ‌కీయ నేత‌ల మొహాలు క‌నిపించేలా డిజైన్ చేసారు. వాళ్ల మొహాల‌తోనే విష్ణు ఫేస్ వ‌చ్చేలా సిద్ధం చేసిన పోస్ట‌ర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ ఒక్క పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తి పెంచేస్తుంది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. సినిమా కూడా పూర్తి సందేశాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది. ఓట‌ర్ అయినా విష్ణుతో ఆడుకుంటున్న విజ‌యాన్ని తీసుకురావాలని ఆశిస్తూ… మంచు విష్ణుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది మై ఫస్ట్ షో.