గ్యాంగ్‌స్టర్ కోసం మ‌ణిశ‌ర్మ‌

సూపర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతోన్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రీక‌ర‌ణ పూర్తి కాగానే మ‌హేష్ ఏ ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తాడ‌న్న‌ది దాదాపు ఓ క్లారిటీ వ‌చ్చేసింది. మ‌హ‌ర్షి లాంటి  బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన వంశీ పైడిప‌ల్లితోనే మ‌రోసారి సెట్స్ కెళ్ల‌నున్నాడు. ఈ కాంబినేష‌న్ లో గ్యాంగ్ స్ట‌ర్ బ్యాక్ డ్రాప్ తో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. మ‌హ‌ర్షి  నుంచి వంశీ మ‌హేష్ తోనే ట్రావెల్ అవుతున్నాడు. ఇత‌ర హీరోల‌తో సినిమాలు చేసే అవ‌కాశం ఉన్నా చేయ‌లేదు. అంటే అప్ప‌టి నుంచి గ్యాంగ్ స్ట‌ర్  స్క్రిప్ట్ సిద్ధం చేసే ప‌నిలోనే నిమ‌గ్న‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది.

తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మ‌రో అప్ డేట్ అందింది. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఈ ఛాయిస్ మ‌హేష్ బాబు తీసుకున్నాడ‌ని వినిపిస్తోంది. ఇలాంటి స్టోరీల‌కు మ‌ణిశ‌ర్మ అయితేనే బాగుంటుంద‌ని ఆయ‌న వైపు మొగ్గు చూపుతున్నాడ‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది.   గ‌తంలో ఇదే కాంబినేష‌న్ లో ఒక్క‌డు, అత‌డు, పోకిరి చిత్రాలు రూపొందిన సంగ‌తి తెలిసిందే. పోకిరి గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యం ఉన్న‌ సినిమా. అందులో పాట‌లు స‌హా మ‌ణిశ‌ర్మ‌ ఆర్ ఆర్ ఆర్ అద‌ర‌గొట్టాడు. అందుకే మ‌హేష్ అత‌న్ని రంగంలోకి దించుతున్నాడు.  ఇక స‌రిలేరుకి దేవీశ్రీ ఇచ్చిన సంగీతంపై ఇప్ప‌టికే టీమ్ అసంతృప్తిగా ఉంద‌న్న ప్ర‌చారం ఉంది. అందుకే ఈసారి మ‌హేష్ దేవీని రిపీట్ చేసే ఆలోచ‌న‌తో లేడ‌న్న వాద‌నా వినిపిస్తోంది.