యాంట్‌మేన్ దుమ్ము దుమారం

Last Updated on by

మార్వ‌ల్ సంస్థ నుంచి వ‌రుస‌గా సూప‌ర్‌హీరో సినిమాల జాత‌ర కొన‌సాగుతోంది. వేల‌కోట్ల రూపాయ‌ల్ని కొల్ల‌గొడుతున్నాయి ఇవ‌న్నీ. మారిన ట్రెండ్‌లో 3డి ఫిక్ష‌న్ సినిమాలు సంచ‌ల‌నాల‌కు అడ్డూ ఆపూ లేదు. ఇప్ప‌టికే ఆటోలు, లారీల్లో సొమ్ముల్ని తోలుకుపోతోంది మార్వ‌ల్ స్టూడియోస్‌. అయితే ఈ సొమ్ములు స‌రిపోవ‌డం లేదుట‌. యూనివ‌ర్శ్‌లో ఉన్న కోట్లాది రూపాయ‌లు నాకే కావాలి! అన్న చందంగా దండ‌యాత్ర సాగిస్తోంది. ఇది దండ‌యాత్రో, దోపిడీ యాత్రో మొత్తానికైతే ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి కోట్ల‌కుకోట్లు మార్వ‌ల్ స్టూడియోస్‌కి త‌ర‌లిపోతున్నాయి. ద‌మ్మున్న సినిమాలు తీసే ఖ‌లేజా ఉండాలే కానీ, డ‌బ్బు – ద‌స్కం దానంత‌ట అదే వ‌స్తుంద‌ని నిరూప‌ణ అవుతోంది.

ఇక‌పోతే ఇప్ప‌టికే బ్లాక్‌పాంథ‌ర్, అవెంజ‌ర్స్‌-ఇన్‌ఫినిటీ వార్ మార్వ‌ల్ సంస్థ నుంచి వ‌చ్చి నిలువుదోపిడీ చేశాయి. ఈ సినిమాలు ఇండియా నుంచి భారీగా వాటా దండుకుపోయాయి. అవెంజ‌ర్స్ 2 ఇప్ప‌టికీ మ‌న దేశం నుంచి కోట్లాది రూపాయ‌ల్ని లాక్కుని పోతోంది. ఇదిలా ఉండ‌గానే.. అదే మార్వ‌ల్ స్టూడియోస్ నుంచి మ‌రో క్రేజీ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. క్రేజీ `యాంట్‌మేన్‌`కి సీక్వెల్ సినిమా ఇది. `యాంట్‌మేన్ అండ్ ది వాస్ప్‌` జూలై 13న‌ రిలీజ్‌కి వ‌స్తోంది. ఈ సంగ‌తిని మార్వ‌ల్ సంస్థ ప్ర‌క‌టించ‌గానే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ యాంట్‌మేన్ వీరాభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ యాంట్‌మేన్‌2పై ఒక్క ఉదుటున అంచ‌నాల్ని పెంచేసింది. యాంట్‌మేన్ అరివీర‌భ‌యంక‌ర విన్యాసాలు, యాక్ష‌న్ విన్యాసాలు, కార్ ఛేజ్‌లు.. ఒక‌టేమిటి ఆ విజువ‌ల్స్ చూస్తుంటేనే స్ట‌న్న‌యిపోవాల్సిందే. ఈ సినిమా యూనివ‌ర్స్‌లో ప‌లు రికార్డుల‌తో పాటు, ఇండియాలో అన్ని రికార్డులు బ్రేక్ చేయ‌డం గ్యారెంటీ అని అర్థ‌మ‌వుతోంది. మార్వ‌ల్ స్టూడియోస్ నుంచి బ్లాక్ పాంథ‌ర్‌, అవెంజ‌ర్స్ -2 త‌ర‌వాత అంత‌కుమించిన క్రేజీ సినిమా వ‌స్తోంద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఇంకో నెల 10 రోజులే ముహూర్తం.. యాంట్‌మేన్ రీఛార్జ్ అయ్యి మ‌రీ వ‌స్తున్నాడు. ఫేస్ చేయ‌డానికి మీరు సిద్ధ‌మా?

User Comments