22 ఎక‌రాల్లో మెగా స్టూడియోస్‌

Last Updated on by

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌గా వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సేమ్ టైమ్ ట్రూజెట్ పేరుతో విమాన‌యాన రంగంలోనూ ప్ర‌వేశించి పెద్ద స‌క్సెస్ సాధించారు. యువ‌హీరోల్లోనే బెస్ట్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా వెలిగిపోతున్నారు. ఇవేగాక చ‌ర‌ణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాపారాలు నిర్వ‌హిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.

ప్ర‌స్తుతం కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ విస్త‌ర‌ణ‌లో భాగంగా .. త‌మ కంపెనీ తీసే సినిమాల కోసం ప్ర‌త్యేకించి ఓ స్టూడియోని నిర్మించే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. అందుకోసం స్థ‌ల ప‌రిశీల‌న సాగుతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సైరా-న‌ర‌సింహారెడ్డి తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం సెట్ వేసిన 22 ఎక‌రాల స్థ‌లంలో స్టూడియో నిర్మిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచ‌న చేశార‌ట‌. ప‌ద్మాల‌య స్టూడియోస్‌, రామానాయుడు స్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రామ‌కృష్ణ స్టూడియోస్ వంటి వాటిని మించి ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అధునాత‌నంగా ఉండాల‌న్న‌ది ప్లాన్ అని తెలుస్తోంది. మ‌రోవైపు రామ్‌చ‌ర‌ణ్ వైజాగ్ ఔట్ స్క‌ర్ట్స్‌లో ప‌ర్వ‌త‌సానువుల్లో భారీగా స్టూడియో నిర్మించే ఆలోచ‌న‌లోనూ ఉన్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న‌కు చాలా ముందుగానే విశాఖ న‌గ‌రంపై అభిమానంతో మెగాస్టార్ చిరంజీవి విశాఖ ఔట్‌స్క‌ర్ట్స్‌లో 1000 పైగా ఎక‌రాలు కొన్నార‌న్న ప్ర‌చారం సాగింది. అక్క‌డా మెగాస్టార్‌- రామ్‌చ‌ర‌ణ్ స్టూడియో క‌డ‌తార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు అందుకు సాయం చేస్తార‌ని చెప్పుకున్నారు. సినీప‌రిశ్ర‌మ‌ను విశాఖ‌కు త‌ర‌లించాల‌న్న ప‌ట్టుద‌ల మెగా – అల్లు కాంపౌండ్‌లో ఇప్ప‌టికీ ఉంది. అయితే అది వెంట‌నే సాగే ప్ర‌క్రియ కాదు. అందుకు ఏపీ ప్ర‌భుత్వం నుంచి ప్రోత్సాహ‌కాలు ద‌క్కాలి. అంటే అది రాజ‌కీయంతో ముడిప‌డిన అంశం కాబ‌ట్టి ఇప్ప‌టికి సైలెంట్‌గా ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇక మెజారిటీ సినీజ‌నం మాత్రం విశాఖ – అర‌కు రెజియ‌న్‌లో మెగాస్టూడియోస్ నిర్మిస్తే అది షూటింగుల‌కు అత్యంత అనుకూలంగా ఉంటుంద‌ని, మెగాస్టార్ – ప‌వ‌ర్‌స్టార్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌కి సెంటిమెంటుగా వ‌ర్క‌వుట‌వుతుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. చెర్రీ ఏం చేస్తార‌న్న‌ది కాస్త వేచి చూడాలి.

User Comments