సంక్రాంతి స‌మ‌రంలో గెలుపెవ‌రిది?

Mahesh and Allu Arjun

ప్ర‌తి సంక్రాంతికి మెగా ఫ్యామిలీ నుంచి మ‌హేష్ కు గ‌ట్టి పోటీ ఎదుర‌వుతూనే వుంది. వ‌న్ నేనొక్క‌డినే స‌మ‌యంలో రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ క‌లిసి న‌టించిన `ఎవ‌డు` విడుద‌లై మ‌హేష్‌కు గ‌ట్టి పోటీనిచ్చింది. ఆ త‌రువాత వ‌చ్చిన `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` స‌మ‌యంలోనూ మెగా ఫ్యామిలీ నుంచి రామ్‌ చ‌ర‌ణ్ న‌టించిన `నాయ‌క్‌` చిత్రం పోటీగా నిలిచింది. ఇలా ప్ర‌తి సంద‌ర్భంలోనూ మెగా ఫ్యామిలీ నుంచి ఏదో ఒక సినిమా మ‌హేష్ చిత్రానికి పోటీగా రిలీజ‌వుతూ హంగామా చేస్తూనే ఉన్నాయి. ఈ పోటీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి కూడా త‌ప్ప‌డం లేదు.

ఎప్ప‌టిలాగే మ‌హేష్ సినిమాని మెగా ఫ్యామిలీ హీరో మూవీ ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచి ఢీకొట్ట‌బోతోంది. మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్‌రాజు, అనిల్ సుంక భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలోకి దిగుతోంది. అయితే ఇదే రోజు మెగా హీరో అల్లు అర్జున్ చిత్రం కూడా రిలీజ్ కాబోతోంది.`అల వైకుంఠ‌పుర‌ములో` సంక్రాంతి బ‌రిలో మెగా సినిమాగా ప‌రిగ‌ణించ‌బ‌డుతోంది. బ‌న్ని హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. ట‌బుతో పాటు కీల‌క తారాగ‌ణం అంతా న‌టిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. జ‌న‌వ‌రి 12నే రిలీజ్ చేయాల‌ని హీరో, ద‌ర్శ‌కుడు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నారు. దీంతో మ‌హేష్, అల్లు అర్జున్ మ‌ధ్య పోటీ అనివార్యంగా మారింది. ఈ పోటీలో ఈ ద‌ఫా మెగా హీరో విజేత‌గ నిలుస్తాడో లేక మ‌హేష్ త‌న పంతాన్ని నెగ్గించుకుంటారో చూడాలి.