Last Updated on by
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వైజయంతి మూవీస్ పతాకంపై తెరకెక్కిన `జగదేక వీరుడు-అతిలోక సుందరి` ఏ స్థాయి విజయం సాధించిందో తెలిసిందే. 1990 వరదల్లో రిలీజైన ఈ చిత్రం ఓవైపు జలప్రళయాన్ని తట్టుకుని మరీ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. చిరు కెరీర్ బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా ఈ సినిమా నిలిచిపోయింది. ఇలాంటి గ్రేట్ మూవీకి సీక్వెల్ తెరకెక్కించేందుకు అశ్వనిదత్ విశ్వప్రయత్నం చేశారు. చిరంజీవి నటవారసుడు రామ్‌చరణ్ ఈ సీక్వెల్లో నటిస్తారని, శ్రీదేవి తనయ జాన్వీ కథానాయికగా టాలీవుడ్‌కి ఆరంగేట్రం చేసే మూవీ ఇదేనని ప్రచారమైంది. గత కొంతకాలంగా కథ తయారు చేస్తున్నానని అశ్వనిదత్ ఇదివరకూ ప్రకటించారు. కానీ ఎందుకనో ఈ సినిమా ఎప్పటికీ పట్టాలెక్కలేదు. ఈలోగానే ఆ కాంపౌండ్‌కి సంబంధించి ఓ హాట్ అప్డేట్ అందింది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వైజయంతి మూవీస్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. `మహానటి` విజయోత్సవం సందర్భంగా ఆ సినిమా గురించి తన అభిప్రాయం తెలిపిన మెగాస్టార్ స్వయంగా ఈ సంగతిని వెల్లడించారు. అశ్వనిదత్ అల్లుడు, `మహానటి` ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `భైరవ` అనే చిత్రంలో నటిస్తున్నా. దీనికి కథ రెడీ అవుతోందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అశ్వనిదత్ అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. రెండేళ్లుగా అశ్వనిదత్‌తో సినిమాకి అవకాశం ఇచ్చినా సరైన కథ కుదరకే ఆలస్యమైందని మెగాస్టార్ తెలిపారు. తాజా ప్రాజెక్ట్ `భైరవ` టైటిల్‌కి తగ్గట్టే `పాతాళ భైరవి` తరహా కథాంశంతో తెరకెక్కనుందని వెల్లడించారు. మొత్తానికి `జగదేకవీరుడు-అతిలోకసుందరి` సీక్వెల్ కుదరకపోయినా ఈ క్రేజీ కాంబినేషన్లో `భైరవ` సెట్స్కెళ్లబోతోంది. ఇది మెగాఫ్యాన్స్కి సంబరం లాంటిదే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `సైరా-నరసింహారెడ్డి` తరవాత బోయపాటి క్యూలో ఉన్నాడు. తదుపరి నాగ్ అశ్విన్‌తో సినిమా ఉంటుందనే భావించాలి.
User Comments