ప్రతి ఒక్కరికీ జీవితంలో స్ఫూర్తి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి వెనక స్ఫూర్తి ఎవరు? అంటే తన స్ఫూర్తి ప్రదాతల్లో ఏఎన్నార్ ఒకరు అని ఆయనే చెప్పారు. అక్కినేని అవార్డ్స్ వేదికపై ఈ సంగతిని చెప్పి ఆశ్చర్యపరిచారు.
అవార్డుల వేదికపై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ..“మా అమ్మ గారికి నాగేశ్వర రావు గారు అంటే అంత అభిమానం కాబట్టే నాకు సినిమా అంటే అంత అభిమానం ఏర్పడింది. అందుకే చదువు అయిపోగానే ఇండస్ట్రీ కి రావాలని కోరుకున్నాను, వచ్చాను. ఎన్.టి.ఆర్ గారు ఏఎన్ఆర్ లాంటి లెజెండరీ పర్సన్స్ ఉన్న టైమ్ లో నేను హీరోగా నిలదొక్కుకోవడం హ్యాపీ గా ఉంది. అలాగే నాగేశ్వర రావు గారితో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించడం నా అదృష్టం. ఆయన ఈ ఇండస్ట్రీ గురించి చెప్పిన ఎన్నో విషయాల వల్లే నేను ఈ రోజు ఈ స్థానానికి రావడానికి దోహద పడింది. ఆరకంగా నాగేశ్వర రావు గారు నాకు గురు తుల్యులు. ఆయన నడిచే నిగంటువు, ఒక ఎన్ సైక్లోపీడియా. అలాంటి మహా నటుడితో నాకు సాంగత్యం ఉండడం నా పూర్వజన్మ సుకృతం. నాగేశ్వర రావు గారు చివరి రోజు వరకూ మానసికంగా, శారీరకంగా ఎంతో బలంగా ఉండేవారు. ఎంతో మంది మహామహులకి ఇస్తున్న ఈ ఎఎన్ఆర్ నేషనల్ అవార్డు ఎదో ఒక రోజుకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అంత గొప్ప అవార్డ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాచేతుల మీదుగా శ్రీదేవి, రేఖ లాంటి లెజెండరీ పెర్సొనాలిటీస్ కి ఈ అవార్డ్ ఇవ్వడం ఎంతో సముచితం. ఇంత గొప్ప అవార్డ్ నా చేతుల మీదుగా ఇచ్చే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి దన్యవాదాలు. ఆవిడతో నేను మూడు నాలుగు సినిమాలు చేశాను. శ్రీదేవి గారు షూటింగ్ లో టైమ్ దొరికితే సినిమా గురించే మాట్లాడేవారు. ఆవిడకి సినిమా గురించి తప్ప మరేమి తెలీదు. ఆవిడ మనమధ్య లేకపోవడం బాధాకరం. అన్ని భారతీయ భాషలలో నటించి లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ అవార్డ్ ఇచ్చి ఆవిడను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. అలాగే ఏజ్ లెస్ స్టన్నింగ్ బ్యూటీ రేఖ చేతుల మీదుగా నేను ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నాను. అలాగే ఈ సంవత్సరం మా ఇంట్లో జరిగే 80స్ క్లబ్ కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. ఈ ఎఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఆవిడకి రావడం ఆమెకు గౌరవం, నా చేతుల మీదుగా ఈ అవార్డ్ ఇవ్వడం నాకు గౌరవం“ అన్నారు.