హీరోయిన్ వల్ల బయటపడ్డ మెగా హీరో రీషూట్లు

మెగా యంగ్ హీరో, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ రిలీజ్ కు రెడీ అయిన నేపథ్యంలో పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసే ఉంటుంది. రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ముందుగా డేట్ ఇచ్చినా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అసలు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమైతే, ఈ జవాన్ ఆగష్టు 11నే థియేటర్స్ లోకి రావాల్సింది. కానీ, ఇప్పుడు అక్టోబర్ వరకు రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి రీషూట్లే కారణమని మొన్నటివరకు వార్తలు కూడా హల్ చల్ చేశాయి.
ముఖ్యంగా చిత్ర సమర్పకుడు దిల్ రాజు ఈ జవాన్ అవుట్ ఫుట్ విషయంలో సంతృప్తిగా లేరని, అందుకే రీషూట్లు చేయిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై నిన్నటివరకు సరైన క్లారిటీ లేకపోయినా.. తాజాగా జవాన్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కారణంగా ఈ రీషూట్ల వ్యవహారం బయటపడటం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే, ఈ టాలెంటెడ్ బ్యూటీ మెహ్రీన్ తాజాగా ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది. అందులో మొన్న తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడిపోయిందీ వివరించింది. మొత్తంగా ఉదయం జవాన్ షూటింగ్ లో పాల్గొన్నట్లు క్లారిటీగా చెప్పేసింది.
ఇక్కడే ఈ బ్యూటీ తనకు తెలియకుండానే ఓ విషయాన్ని బయట పెట్టేసింది. అసలు సెప్టెంబర్ 1వ తేదీకే పక్కా రిలీజ్ అనుకున్న సినిమా ఇంకా షూటింగ్ చేస్తుందంటేనే.. రీషూట్ మేటర్ నిజమేనని సినీవర్గాలు ఓ క్లారిటీకి వచ్చేశాయి. నిన్నటివరకు సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తూ, చిన్నచిన్న టెక్నికల్ ప్రాబ్లెమ్స్ వల్ల వాయిదా వేస్తున్నారనుకుంటే.. ఇప్పుడు ఇంకా పగలు రాత్రి షూటింగ్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా రీషూట్ల మహిమేనని అంటున్నారు. ఏదిఏమైనా, ఇలా హీరోయిన్ వల్ల మెగా హీరో సినిమా రీషూట్ల వ్యవహారం బయటపడటం నిజంగా విశేషమే. అయినా మూవీ అవుట్ ఫుట్ చూసుకుని నచ్చకపోతే.. కొన్ని సీన్స్ రీషూట్ చేయడం ఇప్పుడు తప్పేమీ కాదుగా.