చ‌రిత్ర సృష్టించిన విజ‌య్ సినిమా..

విజ‌య్.. ఈ పేరుకు తెలుగులో పెద్ద‌గా గుర్తింపు లేదేమో కానీ త‌మిళ‌నాట మాత్రం ప్రాణ‌మిచ్చే అభిమానులున్నారు. ఈయ‌న సినిమా వ‌స్తుందంటే పండ‌గ వాతావ‌ర‌ణం ఉంటుంది త‌మిళ‌నాట‌. ఈయన అక్టోబ‌ర్ 18న మెర్స‌ల్ సినిమాతో రానున్నాడు. దీవాళి కానుక‌గా విడుద‌ల కానుంది ఈ చిత్రం.

తెలుగులో అదిరింది పేరుతో విడుద‌ల కానుంది మెర్స‌ల్. ఇప్పుడు ఈ చిత్రానికి ఓ అరుదైన గౌర‌వం ద‌క్కింది. సౌత్ ఇండియా నుంచి ర‌జినీకాంత్.. రాజ‌మౌళి మాత్ర‌మే సాధించిన రికార్డుల‌ను.. గౌర‌వాన్ని ఇప్పుడు విజ‌య్ ద‌క్కించుకుంటున్నాడు.

ఇంత‌కీ ఏ విష‌యంలో అనుకుంటున్నారా..? పారిస్ లో “ది గ్రాండ్ రెక్స్” సినిమాస్ లో మెర్స‌ల్ ను ప్ర‌దర్శించ‌బోతున్నారు. 2 వేల కెపాసిటీ ఉన్న ఈ థియేట‌ర్ యూరప్ లోనే అతిపెద్ద‌ది. కేవ‌లం హాలీవుడ్ సినిమాల‌కు మాత్ర‌మే ఇక్క‌డ స్క్రీనింగ్ ఉంటుంది. గ‌త రెండేళ్ల‌లో క‌బాలి.. బాహుబ‌లి 2 సినిమాల‌ను ఈ స్క్రీన్స్ లో ప్ర‌ద‌ర్శించారు. ఆ త‌ర్వాత మ‌రే సినిమాకు ఈ గౌర‌వం ద‌క్క‌లేదు. ఇప్పుడు విజ‌య్ సినిమాకు ఇది ద‌క్క‌నుంది. తెరీ త‌ర్వాత అట్లీకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టించిన సినిమా ఇది. స‌మంత, కాజ‌ల్, నిత్యామీన‌న్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. విజ‌య్ ఇందులో త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. మ‌రి పారిస్ గౌర‌వానికి త‌గ్గ‌ట్లు సినిమా కూడా అదిరిపోతుందో లేదో..?