మీటూ: బిలియ‌న్ డాల‌ర్ గోల్‌మాల్‌!

Last Updated on by

గ‌త ఏడాది హాలీవుడ్‌ని ఊపేసిన మీటూ హ్యాష్ ట్యాగ్ ఉద్య‌మం ఇప్పుడు ఇండియాని ఒణికిస్తోంది. ఇక్క‌డా బిలియ‌న్ డాల‌ర్ బిజినెస్ ప్ర‌పంచం కొంప కొల్లేరు చేసేట్టే క‌నిపిస్తోంది. ఇదేమీ పైకి క‌నిపించేంత ఆషామాషీగా లేదు. క‌థానాయిక‌లు ఆరోపిస్తే ఎంత పెద్ద స్టార్ హీరోకి అయినా, స్టార్ డైరెక్ట‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్‌కి అయినా ఇంట‌రాగేష‌న్ త‌ప్పేట్టు లేదు. దీని ప‌ర్య‌వ‌సానం భారీ అతి భారీ ప్రాజెక్టుల‌కు పొగ పెట్టేసే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు సూప‌ర్ 30, మొఘ‌ల్ వంటి భారీ చిత్రాల‌కు ఇబ్బందిక‌ర స‌న్నివేశం నెల‌కొంది. ఇప్ప‌టికి తెలిసిన‌వి కొన్ని పేర్లు మాత్ర‌మే. తెలియాల్సిన పేర్లు చాలానే ఉండొచ్చు. అందులో అగ్ర క‌థానాయ‌కులు ఉండొచ్చు. ఒక‌వేళ అదే నిజ‌మైతే సినిమాల బిజినెస్‌లో ఆ మేర‌కు ప్ర‌కంప‌నాలు త‌ప్ప‌వు. అమీర్ ఖాన్‌, హృతిక్ రోష‌న్ అంత‌టి వాళ్లే మీటూ ఇండియా ఉద్యమానికి త‌ల‌వొంచి త‌మ ద‌ర్శ‌కుల‌కు దూరం జ‌రిగారంటే అర్థం చేసుకోవ‌చ్చు. మ‌హిళా మ‌ణుల‌కు ఏ ఇబ్బంది క‌లిగినా అది స‌హించ‌లేనిది అని ప్ర‌క‌టించారు.

మీ..టూ ఉద్య‌మంతో జమానా కాలంలో సాగిన వేధింపుల ప్ర‌హ‌స‌నం ర‌చ్చ‌కెక్కుతోంది. ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న వ్య‌వ‌హారాల‌న్నిటినీ బ‌హిరంగ వేదిక‌పైకి తెస్తోంది మీటూ ఇండియా ఉద్య‌మం. స‌మాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఎన్నో ర‌హ‌స్యాలు లీకైపోతున్నాయి. భారీ ప్రాజెక్టుల‌కు గండి కొట్టే దారుణ‌మైన స‌న్నివేశం వైపు ఇది వెళుతోంది. కొంద‌రు న‌టుల‌కు ఉద్యోగాలు ఊడుతున్నాయి. మ‌రికొంద‌రిని భారీ ప్రాజెక్టుల నుంచి తప్పించాల్సిన సన్నివేశం అగ్ర బ్యాన‌ర్ల‌కు త‌ప్ప‌డం లేదు. కొన్ని ప్రాజెక్టులు మ‌ధ్య‌లో ఉండ‌గానే ద‌ర్శ‌కులకు సైతం రాంరాం ప‌ల‌కాల్సొస్తోంది. ఇక న‌టుల్ని అయితే అర్థాంత‌రంగా సినిమాల నుంచి త‌ప్పించేసే స‌న్నివేశం నెల‌కొంది. త‌నూశ్రీ ద‌త్తా మొదలు పెట్టిన ఈ ఉద్య‌మంలో ప్రియాంక చోప్రా, కంగ‌న ర‌నౌత్, ఐశ్వ‌ర్యారాయ్ అంత‌టి స్టార్ హీరోయిన్లు మేము సైతం అంటూ బాధితుల‌కు బాస‌ట‌గా నిలిచేందుకు ముందుకొచ్చారు.

తనూశ్రీ‌- నానా వ్య‌వ‌హారంలో నానాకి స‌పోర్టుగా నిలిచేది కొంద‌రు అయితే, త‌నూశ్రీ‌కి స‌పోర్టునిచ్చేవాళ్లు మ‌రికొంద‌రు. త‌నూశ్రీ‌కి ప్రియాంక చోప్రా, కంగ‌న ర‌నౌత్ వంటి వాళ్లు స‌పోర్టుగా నిలిస్తే సోన‌మ్ మాత్రం కంగ‌న‌పై సెటైర్వ వేసింది. త‌నూశ్రీకి అండగా నిలిచిన‌ క్వీన్ కంగ‌న‌ డైరెక్ట‌ర్ వికాస్ బాల్ త‌న‌తో అస‌భ్య ంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని తీవ్రంగా ఆరోపించింది కంగ‌న‌. ఆ క్ర‌మంలోనే వికాస్ బాల్ ని సూప‌ర్ 30 సినిమా సందిగ్ధంలో ప‌డింది. వికాస్ బాల్ పై ఇదివ‌ర‌కూ వేరొక మ‌హిళ ఫిర్యాదు చేసిన కేసు విచార‌ణ‌లో ఉండ‌డంతో అత‌డు త‌న నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన స‌న్నివేశం నెల‌కొంది. ఇది భారీ ప్రాజెక్టులు చేసే ఇలాంటి ద‌ర్శ‌కుల వ‌ల్ల అంద‌రికీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితి. పోలీసులు, కోర్టులు, గొడ‌వ‌లు అని తిరిగితే సినిమా తీసేది ఎప్పుడు? వికాస్ బాల్ వివాదాల్లో చిక్కుకోవ‌డంతో పార్ట‌నర్లే ముఖం చాటేశారు. వికాస్ స్నేహితులు అనురాగ్ క‌శ్య‌ప్, విక్ర‌మాధిత్య ఇరువురూ పాంథ‌మ్ కంపెనీ జాయింట్ వెంచ‌ర్ నుంచి త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు హీరో హృతిక్ రోష‌న్ సైతం త‌ప్పు చేసిన వారు ఎంత‌టి వారైనా ఉపేక్షించ‌మ‌ని, వారితో క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధంగా లేన‌ని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. అలాగే జాలీ ఎల్ ఎల్ బి ద‌ర్శకుడు సుభాస్ క‌పూర్‌పై ప్ర‌ఖ్యాత న‌టి గీతిక వేధించాడంటూ ఫిర్యాదు చేయ‌డంతో అత‌డు తెర‌కెక్కించ‌నున్న భారీ హిస్టారిక‌ల్ చిత్రం `మొఘ‌ల్` చిక్కుల్లో ప‌డింది. ఆ మూవీలో న‌టించ‌న‌ని అమీర్ ఖాన్ మొహ‌మాట ప‌డ‌కుండా చెప్పేశాడ‌ట‌. ప్ర‌ముఖ ర‌చ‌యిత వింటా నందా, సంధ్యా మృధుల్ వంటి వాళ్లు న‌టుడు అలోక్‌నాథ్ లైంగిక దాడుల‌ వ్య‌వ‌హారాల్ని బ‌య‌ట‌పెట్టేయ‌డంతో ఆ పెద్ద మ‌నిషి ల‌బోదిబోమంటున్నాడు. మునుముందు అత‌డికి అవ‌కాశాలిచ్చేవాళ్లే ఉండ‌రు. ఇక ఇటీవ‌ల‌ లోరియ‌ల్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న ఐశ్వ‌ర్యారాయ్ మీటూ ఉద్య‌మానికి త‌నవంతు మ‌ద్ద‌తునిస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. మ‌హిళ‌లంతా ఎదురు తిర‌గాల్సి సంద‌ర్భ‌మిది. అన్యాయాల్ని, దుర్మార్గాన్ని ఎదుర్కోవాలి. వేధింపుల విష‌యంలో స‌హించ‌కూడ‌దు అని ఐష్ పేర్కొంది. ఈ సంద‌ర్భంలో బాలీవుడ్ మీడియాలో స‌ల్మాన్ పేరు తెర‌పైకొచ్చింది. అత‌డు ఐష్‌ని తీవ్రంగా వేధించాడ‌ని, ఫిజిక‌ల్ గానూ గాయ‌ప‌రిచాడ‌ని, అయితే ఆ గాయాలు క‌నిపించ‌ని గాయాలు అని ఐష్ వ్యాఖ్యానించింది అంటూ పాత విజువ‌ల్స్‌ని లైవ్‌లో చూపించారు. మొత్తం మీద మీటూ ఉద్య‌మం కొంప ముంచుతోంది. బిలియ‌న్ డాల‌ర్ బిజినెస్ ప్ర‌పంచాన్ని చిక్కుల్లో ప‌డేసేట్టే క‌నిపిస్తోంది.

User Comments