జూట్ మిల్లు కార్మికులకు మంత్రులు హామీ

Last Updated on by

విశాఖపట్నం జిల్లా చిట్టివలస జూట్ మిల్లు కార్మికులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా ప్రభుత్వపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ లు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులిరువురూ మాట్లాడుతూ ఈ చిట్టివలస జూట్ మిల్లు గత పదేళ్లుగా విద్యుత్ కొరత తదితర కారణాల వల్ల మూతపడి ఉందని గత ప్రభుత్వాలకు కార్మికులు ఎన్ని విజ్ణప్తులు చేసినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. ప్రవేట్ యాజమాన్యం కింద పనిచేస్తున్న ఈ జూట్ మిల్లులో 6వేల 100 మంది కార్మికులు పనిచేస్తున్నారని అనగా 2000 మంది శాశ్వత,2వేల మంది బదిలీ,మరో 2వేల 100 మంది అప్రంటీస్ కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు మంగళవారం అమరావతి సచివాలయంలో 5కార్మిక సంఘాల నేతలు,కార్మికశాఖ కమీషనర్ వరప్రసాద్‌తో కలిసి సమీక్షించడం జరిగిందని 15రోజుల్లో కార్మికులకు సంబంధించిన పూర్తి వివరాలను కార్మికశాఖకు సమర్పించాలని అటు కార్మిక సంఘాలకు,ఇటు జూట్ మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించామని మంత్రులు శ్రీనివాస్,జయరామ్ లు తెలిపారు. వచ్చే నెల 9వ తేదీన విశాఖపట్నంలో చిట్టివలస జూట్ మిల్లు సమస్యను పరిష్కరించేందుకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రులు శ్రీనివాస్,జయరామ్ లు వెల్లడించారు.ఒకవేళ జూట్ మిల్లు యాజమాన్యం మిల్లులు తిప్పేందుకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని లేని పక్షంలో కార్మికులకు తగిన పరిహారాన్ని చెల్లించేందుకు సిద్దంగా ఉండాలని యాజమాన్యానికి తెలియజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.పరిహారం ఇవ్వాల్సి వస్తే ఏడాది జీతం ఇవ్వాలని కార్మికులు డిమాండు చేస్తున్నారని కాని మేనేజిమెంట్ 3నెలల జీతం ఇచ్చేందుకు ముందుకు సుముఖంగా ఉందని వారు పేర్కొన్నారు.కాగా చిట్టివలస జూట్ మిల్లు సమస్యపై విశాఖపట్నంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు.గత దశాబ్ద కాలంగా మూతపడిన జూట్ మిల్లు కార్మికుల సమస్యను గత ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కార్మికులు ఆశతో ఉన్నారని వారికి ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చర్యలు తీసుకుంటుందని మంత్రులు శ్రీనివాస్, జయరామ్‌లు స్పష్టం చేశారు.

Also Read : Kousalya Krishnamurthy Official Teaser

User Comments