మిస్ట‌ర్ కేకే మూవీ రివ్యూ

నటీనటులు : విక్ర‌మ్, అక్ష‌ర హాస‌న్, అభి హాస‌న్ (నాజ‌ర్ వార‌సుడు) త‌దిత‌రులు..
బ్యానర్: రాజ్‌కమల్ ఫిలింస్ – పారిజాత మూవీ క్రియేషన్స్ (తెలుగు)
నిర్మాత: క‌మ‌ల్ హాస‌న్
తెలుగు నిర్మాత‌లు: అంజ‌య్య‌, టి నరేష్‌కుమార్, టి శ్రీ‌ధ‌ర్‌
సంగీతం: గిబ్రాన్
రచన- దర్శకత్వం: రాజేష్.ఎం.సెల్వ‌

ముందు మాట:
చియాన్ విక్ర‌మ్ సినిమా అన‌గానే అభిమానుల్లో అంచ‌నాలుంటాయి. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్.. త‌ళా అజిత్ త‌ర‌హాలోనే ప్ర‌యోగాల బాట‌లో స‌క్సెసైన హీరోగా .. విల‌క్ష‌ణ న‌టుడిగా అత‌డికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. అందుకే అత‌డి సినిమాల్ని జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా అభిమానులు ఆద‌రిస్తారు. ఈసారి క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా నిర్మించిన థ్రిల్ల‌ర్ మూవీలో విక్ర‌మ్ హీరో అన‌గానే మ‌రింత ఆస‌క్తి పెరిగింది. అంత‌కుమించి గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో విక్ర‌మ్ పోస్ట‌ర్.. టీజ‌ర్.. ట్రైల‌ర్ ప్ర‌తిదీ ఎగ్జయిట్ మెంట్ పెంచాయి. అయితే పోస్ట‌ర్.. ట్రైల‌ర్ తో వ‌చ్చిన హైప్ కి త‌గ్గ కంటెంట్ సినిమాలో ఉందా? లేదా.. చాలా కాలంగా దోబూచులాడుతున్న హిట్టు విక్ర‌మ్ ద‌క్కించుకున్నారా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

సింగిల్ లైన్:
ఒక హ‌త్య చేసి ఆ నేరాన్ని వేరొక‌రి మీదకు నెట్టేసేందుకు ఓ పోలీసాఫీస‌ర్ ప‌న్నిన ప‌న్నాగం ఏంటి? ఆ ప‌న్నాగం నుంచి.. చేయ‌ని త‌ప్పు నుంచి గ్యాంగ్ స్ట‌ర్ అయిన క‌థానాయ‌కుడు(విక్ర‌మ్) ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? ఈ క‌థ‌లో ఫ్రెగ్నెంట్ అయిన అక్ష‌ర హాస‌న్ కిడ్నాప్ క‌థేమిటి? త‌న‌ని ర‌క్షించేందుకు భ‌ర్త అభి ఏం చేశాడు? అన్న‌ది సినిమా క‌థాంశం.

కథనం అనాలిసిస్:
మిస్ట‌ర్ కేకే (శిక్ర‌మ్) మ‌లేసియాలో పెద్ద గ్యాంగ్ స్ట‌ర్. అత‌డు తీవ్రంగా గాయ‌ప‌డిన స్థితిలో అత‌డిని ఓ వ్య‌క్తి (అభి) కాపాడ‌తాడు. అయితే కేకే అండ్ గ్యాంగ్ అక్క‌డికి వ‌చ్చిన ప‌ని వేరు. త‌మ బాస్ ని ర‌క్షించుకునేందుకు కేకే అండ్ గ్యాంగ్ చివ‌రికి కేకేని కాపాడిన వ్య‌క్తి (అభి) భార్య అయిన అక్ష‌ర హాస‌న్ ను కిడ్నాప్ చేయాల్సి వ‌స్తుంది. ఫ్రెగ్నెంట్ అయిన అక్ష‌ర హాస‌న్ ను అడ్డు పెట్టుకుని త‌మ బాస్ ని ర‌క్షించుకునేందుకు ఆ గ్యాంగ్ ప్ర‌య‌త్నిస్తుంది. అందుకోసం అభిని టార్చ‌ర్ చేస్తారు. ఈ కిడ్నాప్ డ్రామాలోనే కేకేని వెంబ‌డించే పోలీస్ బృందం .. ఛేజ్ లు వ‌గైరా యాక్ష‌న్ తో సినిమా సాగుతుంది. త‌న‌ని అనుమానించిన పోలీసుల‌కు తాను నిందితుడిని కాదు అని నిరూపించుకునేందుకు గ్యాంగ్ స్ట‌ర్ కేకే చేసిన ప్ర‌య‌త్నం ఎలాంటిది? కిడ్నాప్ నుంచి చివ‌రికి అక్ష‌ర హాస‌న్ ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా సినిమా.

అయితే ఇంత స‌ర‌ళ‌మైన క‌థ‌ని ద‌ర్శ‌కుడు సెల్వ‌ అంతే పేల‌వంగా తెర‌కెక్కించాడు. అస‌లే క‌థ వీక్ అనుకుంటే దానికి క‌థ‌నంలోనూ మ్యాట‌ర్ లేక‌పోవ‌డంతో సినిమా తేలిపోయింది. ఈ సినిమాలో ఎక్క‌డా ఆస‌క్తి క‌లిగించే ఒక్క ఎలిమెంట్ కూడా ఉండ‌దు. ముఖ్యంగా విక్ర‌మ్ పాత్ర‌ను ఎంతో ఊహించుకుంటే ఇంత సాధా సీదాగా ఉందే అనిపిస్తుంది. ఇక ట్రైల‌ర్ లో చూపించిన ఆ గ్రిప్ సినిమా స్క్రీన్ ప్లేలో మాత్రం క‌నిపించ‌దు. ఒక ల‌ఘు చిత్రాన్ని కాస్తంత రిచ్ గా తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. చివ‌రికి పోలీసాఫీస‌ర్ తో క్లైమాక్స్ ఫైట్ తో సినిమా ఎండ్ అవుతుంది.

నటీనటులు:
ఎంచుకున్న క‌థ బావున్నా అందులో విక్ర‌మ్ పాత్ర చిత్ర‌ణ ఏమాత్రం ఆక‌ట్టుకోదు. అత‌డికి న‌టించే స్కోప్ కూడా ఏమాత్రం లేదు. ఇక‌పోతే అక్ష‌ర హాస‌న్ ఫ్రెగ్నెంట్ గా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. అభి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఇక ఇత‌ర గ్యాంగ్ అవ‌స‌రం మేర న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు.

టెక్నికాలిటీస్:
విజువ‌ల్ గా కెమెరా వ‌ర్క్ .. గిబ్రాన్ రీరికార్డింగ్ ఆక‌ట్టుకున్నాయి. ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు డీసెంట్. ఇత‌ర విభాగాలు ఓకే.

ప్లస్ పాయింట్స్:

* కిడ్నాప్ డ్రామా క‌థాంశం
* నేచుర‌ల్ ఫైట్స్

మైనస్ పాయింట్స్:

* క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ నిల్
* ఏమాత్రం గ్రిప్ లేని స్క్రీన్ ప్లే

ముగింపు:
గ్రిప్ లేని కిడ్నాప్ గ్యాంగ్ స్టోరి.. విక్ర‌మ్ కి మ‌రోసారి నిరాశే

రేటింగ్:
1/5