ప్రివ్యూ: గాయ‌త్రి

Last Updated on by

గాయ‌త్రి.. ఈ చిత్రం గురించి ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తుంది. కొన్నేళ్లుగా మంచు కుటుంబంలో ఏ హీరో సినిమాకు రాని ప్రీ రిలీజ్ క్రేజ్ గాయ‌త్రికి వ‌చ్చింది. విష్ణు, మ‌నోజ్ సినిమాల‌కు కూడా ఇంత బ‌జ్ రాలేదు. కానీ ఇప్పుడు 70కి చేరువ‌లో ఉండి మోహ‌న్ బాబు త‌న సినిమాకు ఇంత రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. గాయ‌త్రి సినిమా ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ క‌చ్చితంగా మంచు కుటంబానికి చాలా రోజుల త‌ర్వాత మంచి ఓపెనింగ్స్ వ‌చ్చేలా అయితే క‌నిపిస్తున్నాయి. రీమేక్ సినిమానే అయినా కూడా మ‌ద‌న్ ఈ చిత్రాన్ని పూర్తిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లుగా మార్చేసాడ‌ని చెబుతున్నాడు మోహన్ బాబు. గాయ‌త్రి సినిమా మొద‌లుపెట్టిన‌పుడు క‌నీసం ఎవ‌రూ ఈ చిత్రాన్ని ప‌ట్టించుకోలేదు. కానీ ఒక్కో లుక్.. టీజ‌ర్.. ట్రైల‌ర్ విడుద‌ల‌వుతున్న కొద్దీ సినిమాను సీరియ‌స్ గా తీస‌కోవ‌డం మొద‌లుపెట్టారు ప్రేక్ష‌కులు.

ఇందులో ఒక‌ప్ప‌టి మోహ‌న్ బాబులా రెచ్చిపోయాడు క‌లెక్ష‌న్ కింగ్. అంతేకాదు.. ఇందులో విల‌న్ గానూ ర‌ప్ఫాడించాడు ఈ సీనియ‌ర్ హీరో. చాలా ఏళ్ళ త‌ర్వాత పూర్తిస్థాయి విల‌న్ గా న‌టించాడు మోహ‌న్ బాబు. ప్ర‌తినాయ‌కుడు గాయ‌త్రి ప‌టేల్ పేరునే సినిమా టైటిల్ గా పెట్టాడు ద‌ర్శ‌కుడు మ‌ద‌న్. ఇక శివాజీగా మ‌రో పాత్ర‌లోనూ న‌టించాడు మోహ‌న్ బాబు. ఇదే పాత్ర యంగ్ వ‌ర్ష‌న్ లో విష్ణు న‌టించాడు. అంటే యంగ్ మోహ‌న్ బాబు పాత్ర అన్న‌మాట‌. శ్రీ‌య ఈ పాత్ర‌కు జోడీగా న‌టించింది. గాయ‌త్రి త‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంద‌ని.. మ‌రీ ముఖ్యంగా ఇది అసెంబ్లీ రౌడీ రేంజ్ స్క్రిప్ట్ అంటున్నాడు మోహ‌న్ బాబు. తొలిప్రేమ, ఇంటిలిజెంట్ లాంటి సినిమాల‌తో పోటీ ప‌డుతూ క‌లెక్ష‌న్ కింగ్ బ‌రిలోకి దిగుతున్నాడు. మ‌రి చూడాలిక‌.. క‌లెక్ష‌న్ కింగ్ ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో..?

User Comments