మోహ‌న్ బాబు తప్పు చేశాడా..?

సీనియ‌ర్ హీరోలంతా ఇప్పుడు బాగా స్లో అయిపోయారు. క‌థ న‌చ్చితే త‌ప్ప ముందుకు అడుగేయ‌డం లేదు. క‌థ న‌చ్చితే త‌ప్ప వాళ్లు రిస్క్ తీసుకోవ‌ట్లేదు. ఇప్పుడు మోహ‌న్ బాబు కూడా అంతే. ఒక‌ప్పుడు ఈయ‌న నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే భారీ అంచ‌నాలుండేవి. కానీ ఇప్పుడు అది క‌నిపించ‌డం లేదు. దానికి కార‌ణం ఆయ‌న సినిమాలు చాలా కాలంగా బాగా ఆడ‌క‌పోవ‌డ‌మే. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మోహ‌న్ బాబు క‌లెక్ష‌న్ కింగ్ అనిపించుకుని చాలా కాల‌మైంది. ఇన్నాళ్ల త‌ర్వాత ఆయ‌న సోలో హీరోగా మ‌రో సినిమా చేస్తున్నాడు. అదే గాయ‌త్రి. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత క‌చ్చితంగా గాయ‌త్రిపై అంచ‌నాలు పెర‌గ‌డం ఖాయం. మోహ‌న్ బాబు కెరీర్ 42 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఎంబి 42 అనేది పోస్ట‌ర్ పై రిప్ర‌జెంట్ చేస్తున్నారు. పెళ్లైన కొత్త‌లో ఫేమ్ మ‌ద‌న్ ద‌ర్శ‌కుడు. ఒక‌ప్పుడు తాను చేసిన అసెంబ్లీ రౌడీ త‌ర‌హా స్క్రిప్ట్ ఇద‌ని చెబుతున్నాడు మోహ‌న్ బాబు.

టీజ‌ర్ లో మోహ‌న్ బాబు చాలా ఇంటెన్స్ ఉన్న లుక్ లో క‌నిపించాడు. మాసిన గ‌డ్డం.. ర‌ఫ్ లుక్.. ఫేస్ లో ఆ కోపం చూస్తుంటే ఎవ‌రిమీదో బాగా ప‌గ ప‌ట్టేసిన‌ట్లు తెలుస్తుంది. ఇది రివేంజ్ డ్రామానా కాదా అనే విష‌యం తెలియాల్సి ఉంది. ఇందులో విష్ణు కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అప్పుడు రాముడు చేసింది త‌ప్పైతే.. ఇప్పుడు నేను చేసింది కూడా త‌ప్పే అంటూ పురాణాల‌ను బాగానే ట‌చ్ చేసాడు మోహ‌న్ బాబు. ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే యాంక‌ర్ అన‌సూయ ఇందులో కీల‌క‌పాత్ర‌లో క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇదంతా చూస్తే గాయ‌త్రి ఏదో అల్లాట‌ప్పాగా వ‌స్తున్న‌ట్లు క‌నిపించ‌ట్లేదు. ఈ సినిమా త‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్ గా మారుతుంద‌ని ఆశిస్తున్నాడు మోహ‌న్ బాబు. ఫిబ్ర‌వరి 9న గాయ‌త్రి విడుద‌ల కానుంది. మ‌రి మోహ‌న్ బాబు కోపానికి కార‌ణం ఎవ‌రో..?