గాయ‌త్రి వ‌స్తుంది.. గెట్ రెడీ..

గాయ‌త్రి ఎవ‌రూ.. ఆమె వస్తే ఏంటి.. అంత ఆస‌క్తి ఎందుకు అనుకుంటున్నారా..? ఇక్కడ గాయ‌త్రి అంటే ఎవ‌రో హీరోయిన్ కాదు.. సినిమా టైటిల్. మ‌న క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు న‌టిస్తోన్న సినిమా పేరు ఇది. ఈ మ‌ధ్య కాలంలో మోహ‌న్ బాబు కెరీర్ స్లో అయింది. ఒక‌ప్ప‌ట్లా సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌ట్లేదు ఈ సీనియ‌ర్ హీరో. న‌చ్చిన క‌థ దొరికితే కానీ మేక‌ప్ వేసుకోడానికి ఇష్ట‌ప‌డ‌ట్లేదు మోహ‌న్ బాబు. ఈ స‌మ‌యంలో మోహ‌న్ బాబు గాయ‌త్రి సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారు. అది కూడా ఒక‌ప్పుడు తాను చేసిన అసెంబ్లీ రౌడీ త‌ర‌హా స్క్రిప్ట్. ఈ విష‌యం స్వ‌యంగా క‌లెక్ష‌న్ కింగే చెప్పారు. చాలా రోజుల త‌ర్వాత తన‌కు బాగా న‌చ్చిన క‌థ ఇది అంటున్నాడు ఈ సీనియ‌ర్ హీరో.

 

Mohan Babu Gayatri Movie Title Logo First Look Released

ఈ చిత్రంలో విష్ణు కూడా న‌టిస్తున్నాడు. మ‌రో విశేషం ఏంటంటే యాంక‌ర్ అన‌సూయ ఇందులో కీల‌క‌పాత్ర‌లో క‌నిపిస్తుంది. పెళ్లైన కొత్త‌లో ఫేమ్ మ‌ద‌న్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ చిత్రంలోని తొలిపాట‌ను తిరుప‌తిలో చిత్రీక‌రించాడు. దానికోసం ప్ర‌త్యేకంగా గ‌ణేష్ విగ్ర‌హాన్ని త‌యారు చేయించడ‌మే కాదు.. ఈ పాట‌లో 1000 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు.. 400 మంది డాన్స‌ర్లు క‌నిపించారు. బాలీవుడ్ స్టార్ కొరియోగ్ర‌ఫ‌ర్ గ‌ణేష్ ఆచార్య ఈ పాట‌కు స్టెప్స్ కంపోజ్ చేసాడు. ఈ చిత్రంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయంటున్నాడు మోహ‌న్ బాబు. ఈ రోజు అంటే న‌వంబ‌ర్ 21 రాత్రి 10 గంటల‌కు మోహన్ బాబు గారు ట్విట్టర్ ద్వారా గాయత్రి సినిమా టైటిల్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేసాడు. ఇదంతా చూస్తుంటే గాయ‌త్రి ఏదో అల్లాట‌ప్పాగా ఉన్న‌ట్లు క‌నిపించ‌ట్లేదు. ఈ సినిమా త‌న‌కు సెకండ్ ఇన్నింగ్స్ గా మారుతుంద‌ని ఆశిస్తున్నాడు మోహ‌న్ బాబు.