మోహ‌న్‌బాబుకు ఏడాది జైలు

Last Updated on by

తేదేపాను, చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ.. ఇటీవలే వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్న మోహ‌న్ బాబుకు దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం మోహ‌న్ బాబుకు చెందిన‌ తిరుప‌తి శ్రీ‌విద్యానికేత‌న్ కి ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ఇవ్వ‌కుండా నానా తిప్ప‌లు పెడుతోంది. ఇప్పుడు ఆయ‌న‌ మెడ‌కు పాత‌ చెక్ బౌన్స్ కేసు ఇబ్బందిక‌రంగా మారింది. ఈ కేసులో అత‌డికి ఏకంగా ఏడాది పాటు జైలు శిక్ష‌ను విధిస్తూ హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ కోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ల‌క్ష్మి ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ రూ.10 వేలు చెల్లించాల‌ని, ఏ2గా ఉన్న మోహ‌న్ బాబుకు ఏడాది జైలు శిక్ష‌తో పాటు రూ.41,75,000 చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది.

`స‌లీం` చిత్రం రిలీజై దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత ఈ తీర్పు వెలువ‌డ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 2010లోనే ద‌ర్శ‌కుడు వైవియ‌స్ చౌద‌రి నిర్మాత మోహ‌న్ బాబుపై చెక్ బౌన్స్ కేసు పెట్టారు. స‌లీం సినిమా టైమ్ లో 40లక్ష‌ల చెక్ రాసిచ్చిన మోహ‌న్ బాబు స‌రిప‌డా సొమ్ము నిల్వ‌ల్ని బ్యాంకులో ఉంచ‌లేదు. దీంతో చెక్ బౌన్స్ కేసులో వైవియ‌స్ కోర్టు మెట్లు ఎక్కారు. ఈ కేసు విష‌య‌మై నేడు తుది తీర్పు వెలువ‌డింది. అలాగే మోహ‌న్ బాబు ఆ సొమ్ములు మొత్తం వెంట‌నే చెల్లించ‌క‌పోతే మ‌రో మూడు నెల‌లు అద‌నంగా జైలు శిక్ష అనుభ‌వించాల‌ని జ‌డ్జి తీర్పును వెలువ‌రించారు. ఇప్ప‌టికే మోహ‌న్ బాబు బెయిల్ కి అప్ల‌య్ చేశార‌ని తెలుస్తోంది. మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా వైవియ‌స్ చౌద‌రి తెర‌కెక్కించిన `స‌లీం` డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడు వైవియ‌స్ తో మంచు ఫ్యామిలీ విభేధాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

User Comments