మోహన్ బాబు తన కొడుకుని కూడా వదల్లేదు..!

టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముక్కుసూటిగా మాట్లాడతారనే విషయం తెలిసిందే. ఆయన ఎంత విలక్షణ నటుడో.. వ్యక్తిత్వంలో కూడా అంతే ఓపెన్ గా, పర్ఫెక్ట్ గా ఉంటారు. అందుకే వేదిక ఏదైనా తప్పొప్పులు గురించి మాట్లాడుతూ ఆయన ఎవరికైనా సరే క్లాస్ పీకుతూ ఉంటారు. అయితే, ఈసారి వేరెవరికో కాకుండా స్వయంగా తన కొడుక్కే మోహన్ బాబు క్లాస్ పీకడం విశేషం. ఆ స్టోరీలోకి వెళితే, తాజాగా మంచు విష్ణు లేటెస్ట్ మూవీ ‘లక్కున్నోడు’ ఆడియో రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు హాజరైన మోహన్ బాబు తన బిడ్డ విష్ణు చాలా సిన్సియర్ అని అందరూ ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే, ఆ తర్వాత ఓ విషయంలో విష్ణు కారణంగా తనకు కలిగిన నిరుత్సాహాన్ని వేదిక మీదే వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పడం మోహన్ బాబుకే చెల్లింది.

ముందుగా.. విష్ణు, నీకో వార్నింగ్ ఇస్తున్నాను, భార్య ఇద్దరు బిడ్డలు ఉన్నవాడివి, ఈ మధ్యనే టీవీల్లో చూశాను, పదిమంది ఎదుట ఉన్నప్పుడు పదిమందిలో నువ్వు చేసిన తప్పు చెప్పాలి, ఇది నీకో వార్నింగ్ అంటూ మొదలెట్టిన మోహన్ బాబు.. ‘నేను సాధారణంగా నా ఆడియో ఫంక్షన్ కి కూడా వెళ్ళను’ అని ఎక్కడో ఫంక్షన్లో అన్నావు, అది తప్పు, నీ ఆడియో ఫంక్షన్ కి నువ్వు వెళ్ళాలి, పది మంది హీరోలు నిన్ను ప్రేమగా పిలిచినప్పుడు వారి ఆడియో ఫంక్షన్ కి వెళ్ళాలి, అంతేగాని నా ఆడియో ఫంక్షన్ కి కూడా నేను వెళ్ళను అని కొంతమంది హీరోల్లా డబ్బాలు కొట్టుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. చివరగా అర్థమైందా విష్ణు అంటూ.. బీ సిన్సియర్, సిన్సియర్ గా ఉన్నప్పుడే అన్నీ ఉంటాయ్ మనకి అని, డబ్బాలు వద్దు మనకు అని కొడుకు విష్ణుకి మోహన్ బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మోహన్ బాబు తన కొడుకుని కూడా వదల్లేదు అంటూ చూసిన వాళ్ళు సరదా కామెంట్లు చేయడం మొదలెట్టారు.