అర‌వ‌నేల‌పై టికెట్ పోటు.. 

సామాన్య ప్రేక్ష‌కుడు సినిమాకు వెళ్లాలంటే ఒక‌ప్పుడు మ‌హా అయితే 100 రూపాయ‌లు అయ్యేవి. ఆ త‌ర్వాత అది 300కి పెరిగింది. ఇప్పుడు 500 రూపాయ‌లు లేక‌పోతే ఓ మ‌ధ్య తర‌గ‌తి వ్య‌క్తి ఫ్యామిలీతో సినిమాకు వెళ్ల‌లేని ప‌రిస్థితి. అదే మ‌ల్టీప్లెక్స్ కు వెళ్లాలంటే 1000 వ‌దలాల్సిందే. కానీ సీన్ మారింది. ఇప్పుడు ఒక్క‌రు సినిమాకు వెళ్లాలంటేనే టికెట్ రేట్ 230 రూపాయ‌లు పెట్టాల్సిందే. అది ఆన్ లైన్ లో కొంటే. అదే థియేట‌ర్స్ ద‌గ్గ‌రికి వెళ్లి తీసుకుంటే 204 రూపాయ‌లు. ఇంత టికెట్ రేట్ ఎక్క‌డుంది అనుకుంటున్నారా…? మ‌న ప‌క్కనున్న త‌మిళ‌నాట‌ ఇప్పుడు ఇదే రేట్ అమ‌లులో ఉంది. అందుకే థియేట‌ర్ యాజ‌మాన్యాల‌తో పాటు నిర్మాత‌ల మండ‌లి కూడా ప్ర‌భుత్వంపై కోపంగా ఉంది.
జిఎస్టీ బిల్ పాస్ అయినప్ప‌టి నుంచి ఆ ప‌న్ను కూడా నిర్మాత‌లే క‌డుతూ వ‌చ్చారు. కానీ ఇప్పుడు వాళ్ల‌కు ఇది త‌ల‌కు మించిన భారం అయింది. అందుకే జిఎస్టీ పోటు కూడా ప్రేక్ష‌కుల‌పైనే వేసారు. దాంతో ఉన్న‌ఫ‌లంగా టికెట్ రేట్ల‌పై 28 శాతం పెరిగింది.. పైగా ప్ర‌భుత్వం వేసిన అద‌న‌పు 10 శాతంతో పాటు మ‌రో 14 ప‌ర్సెంట్ అన్నీ ఇప్పుడు ప్రేక్ష‌కుల నెత్తిపైనే వేసారు. దాంతో టికెట్ రేట్ కాస్తా 150 నుంచి 204కి వెళ్లిపోయింది. అదే సింగిల్ స్క్రీన్స్ లో అయితే 126 రూపాయ‌లు టికెట్ రేట్ అయింది. ఊళ్ల‌లో ఉండే థియేట‌ర్స్ లో కూడా 80 నుంచి 100 రూపాయ‌ల‌కు టికెట్ రేట్ పెరిగింది. ఇలా ఎక్క‌డిక‌క్క‌డ టికెట్ రేట్లు పెర‌గ‌డంతో సామాన్య ప్రేక్ష‌కుడికి పోటు పెరిగిపోయింది. ఈ టికెట్ రేట్ పోటు మొద‌ట ప‌డేది మెర్స‌ల్ సినిమాపైనే. ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. విజ‌య్ సినిమాకు ఈ పోటు ఎలా ఉండ‌బోతుందో..?