వేల కోట్ల రియ‌ల్ డాన్ క‌థ‌!

Last Updated on by

సీనియ‌ర్ న‌టుడు, ఎంపీ ముర‌ళీ మోహ‌న్ `రియ‌ల్` లీల‌ల గురించి ప్ర‌త్యేకించి పూస గుచ్చాల్సిన ప‌నే లేదు. ఆయ‌న ఏది చేప‌ట్టినా అది క‌న‌కంగా మారుతుంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ప్ర‌తిప‌క్ష వైకాపా, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయ‌కులు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ముర‌ళీమోహ‌న్ ప్ర‌త్య‌క్ష‌ బినామీ అని విమ‌ర్శిస్తుంటారు. అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప‌దేళ్ల పాటు రాజ్య‌మేలారు. ఆరోజుల్లోనే ముర‌ళీ మోహ‌న్ రియ‌ల్ ఎస్టేట్‌లో భారీగా ఆర్జించారు. ఆయన ఆస్తుల విలువ వేల కోట్ల‌లో ఉంటుంద‌న్న ప్ర‌చారం సాగింది.

అయితే అన్ని ఆస్తులు ఎలా సాధ్యం? అంటే అదంతా రియ‌ల్ మ‌హ‌త్తు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఒక్క‌సారిగా నేల‌మ‌ట్టం అయ్యింది. అయితే విభ‌జ‌న ప్ర‌క్రియ పూర్త‌య్యాక ఇరు రాష్ట్రాల్లో ప‌రిస్థితులు ఇన్నాళ్టికి కుదుట‌ప‌డ్డాయి. దీంతో మ‌ళ్లీ రియ‌ల్ బిజినెస్‌లోకి భారీ ఎత్తున పెట్టుబ‌డుల వ‌ర‌ద పారుతోంది. ఆ క్ర‌మంలోనే ఎంపీ ముర‌ళీ మోహ‌న్ రియ‌ల్ బిజినెస్‌కి రెక్క‌లొచ్చాయ‌ని చెబుతున్నారు. జ‌య‌భేరి వెంచ‌ర్స్‌లో ప్ర‌స్తుతం భారీ పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని తెలుస్తోంది. ఇది ఇప్ప‌టిదే కాదు, అనాదిగా న‌డుస్తున్న రియ‌ల్ డాన్ హిస్ట‌రీ అని చెప్పొచ్చు. చంద్ర‌బాబు పాల‌న‌లోనే హైటెక్ సిటీ, హైద‌రాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో వంద‌ల ఎక‌రాల్లో వేల కోట్ల విలువ చేసే భారీ ప్రాజెక్టుల్ని ముర‌ళీ మోహ‌న్ జ‌య‌భేరి వెంచ‌ర్స్ చేప‌ట్టింది. ఇవ‌న్నీ వేల కోట్ల బ‌డ్జెట్ల‌తో.. భారీ రియ‌ల్ వెంచ‌ర్లు మాత్ర‌మే. వీటిని ఖ‌రీదైన ల‌గ్జ‌రీ లైఫ్ ఉన్న‌వాళ్లు మాత్ర‌మే కొనుక్కోగ‌ల‌రు.

ప్ర‌స్తుతం నాన‌క్‌రామ్ గూడ నుంచి గ‌చ్చిబౌళి ఔట‌ర్ రింగ్ రోడ్‌ని ఆనుకుని 100 ఎక‌రాల్లో జ‌య‌భేరి సంస్థ భారీ వెంచ‌ర్లు వేసిందిట‌. ఇవ‌న్నీ ఇండివిడ్యువ‌ల్ విల్లాలు. 7 కోట్ల నుంచి 10 కోట్ల రేంజులో ఇవి అందుబాటులో ఉన్నాయిట‌. వీటిని జ‌య‌బేరి సంస్థ ఆన్‌లైన్ ద్వారా క్ర‌య‌విక్ర‌యాలు సాగిస్తోంది. అంత ఖ‌రీదు ఉన్నా.. క‌ళ్లు మూసుకుని కొనేసే ద‌ర్జా బాబుల‌కు కొద‌వేం లేద‌ని చెబుతున్నారు. ఇక ఈ విల్లాల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఇందులో ప్ర‌వేశించాల‌నుకున్న ఫ్యామిలీ చీపుర పుల్ల కూడా తీసుకెళ్లాల్సిన ప‌నేలేదు. తాళం చెవి ఇస్తే తీసుకుని లోన అడుగుపెట్ట‌డ‌మే. చెంబు, త‌పాలా, నుల‌క‌ మంచం ఇవేవీ తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. గ్యాస్ సిలెండ‌ర్ కూడా వాళ్లే ఎరేంజ్ చేస్తారు. విల్లాలో స‌ర్వం అందుబాటులో ఉంటాయి. సెంట్ర‌ల్ ఏసీతో విల్లా అంతా మంచు కురిసిన అనుభ‌వాన్ని ఇస్తుందిట‌. ఇన్ని ర‌కాల స‌క‌ల సౌక‌ర్యాలు అందుబాటులో ఉంటాయి కాబ‌ట్టి, వీటిని ఎన్నారైలు క‌ళ్లు మూసుకుని కొనేసేందుకు వెన‌కాడ‌డం లేద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు విభ‌జ‌న తర్వాత విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి, రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో వంద‌లాది ఎక‌రాల్లో జ‌య‌భేరి సంస్థ, దీని అనుబంధ సంస్థ‌లు భారీ రియ‌ల్ వెంచ‌ర్లకు ప్లాన్ చేసింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇవ‌న్నీ అండ‌ర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఉన్నాయి. వీటికి ఇప్ప‌టికే టీవీ యాంక‌ర్ల‌తో కావాల్సినంత ప్ర‌చారం చేస్తున్నారు. కొత్త రాజ‌ధాని ప‌రిస‌రాల్లో ఇల్లు కావాల‌నుకున్న వాళ్లంతా అడ్వాన్సులిచ్చి కొనుక్కుంటున్నారు. ఇలా కొనేవాళ్ల‌లో సినీబిగ్ గ‌న్స్, భారీ పారితోషికాలు అందుకునేవాళ్లు ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక ఏపీలో ఆర్థిక రాజ‌ధానిగా అత్యంత వేగంగా ఎదిగేస్తున్న బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలోనూ ఇవే కంపెనీలు భారీ వెంచ‌ర్లు వేస్తున్నాయ‌ని తెలుస్తోంది. మొత్తానికి ఒక రియ‌ల్ డాన్ క‌థ వేల‌ కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్త‌డం వెన‌క అంత‌టి సుదీర్ఘ‌మైన చ‌రిత్ర ఉంద‌న్న‌ది వాస్త‌వం. దీనిపై మ‌రోసారి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

User Comments