వావ్.. మహేష్ డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా..!

ఏఆర్ మురుగదాస్.. కమర్షియల్ ఎలిమెంట్స్ ను పుష్కలంగా ఉంచుతూ సమాజానికి చిన్న మెసేజ్ కూడా ఇచ్చే చిత్రాలు తీయడంలో దిట్ట. ఆయన తీసినవి కొన్ని చిత్రాలే అయినా అవి ఎలాంటి పెద్ద హిట్ సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  అందుకు ఒక చిన్న ఉదాహరణ గజినీ, తుపాకీ వంటి చిత్రాలు.  ఇవి తమిళంలో ఎంత హిట్ అయ్యాయో ఇటు తెలుగులో కూడా అలాగే మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ప్రిన్స్ మహేష్ బాబుతో చేసిన స్పై నేపథ్యంలో సాగే స్పైడర్ వస్తోంది.  ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.  దసరా సందర్భంగా సెప్టెంబర్ 27 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే, ఈ సినిమా తరువాత నెక్ట్స్ మురుగదాస్ ఎవరితో సినిమా చేస్తున్నారు.  ఆ ఛాన్స్ ఎవరికి వస్తుంది అనే దానిపై చర్చలు జరుగుతుండగా.. ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు తాను ఓ కథ వినిపించానని.. అది ఆయనకు బాగా నచ్చిందని మురుగదాస్ చెప్పడం విశేషం. అంతేకాకుండా రజినీకాంత్ కు నచ్చే కథను సిద్ధం చేయడం కత్తి మీద సాము కాకపోయినా.. సినిమా హిట్ చేయడమే తన లక్ష్యమని మురుగదాస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. చివరగా సెప్టెంబర్ 27 స్పైడర్ తరువాత రజినీకాంత్ సినిమాకు ఫుల్ స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉంటానని మురుగదాస్ తెలియజేసినట్లు సమాచారం.  ప్రస్తుతం రజినీకాంత్ పా.రంజిత్ దర్శకత్వంలో కాలా సినిమా చేస్తున్నారు. అటు శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 కూడా చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. విజువల్స్ ఎఫెక్ట్స్ వలన సినిమా ఆలస్యం అవుతోంది. దీనికంటే ముందే కాలా రిలీజ్ అవుతుందని అంటున్నారు.  సో, రజినీకాంత్ వరసగా క్రేజీ కాంబినేషన్లో సినిమాలు చేస్తున్నారన్నమాట. ఇదిలా ఉంటే, మహేష్ స్పైడర్ తర్వాత తమిళ యంగ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేయనున్నట్లు మురుగదాస్ ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసే ఉంటుంది. ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఎప్పుడో పూర్తి అయిపోవడంతో.. నెక్స్ట్ రజినీ స్కిప్ట్ పై కూడా మురుగదాస్ తన టీమ్ తో కలిసి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇటు విజయ్ సినిమా.. అటు కాలా, 2.0 సినిమాల తర్వాత రజినీకాంత్ – మురుగదాస్ కాంబో సినిమా ఖాయం అంటున్నారు. మరి ఇదే నిజమైతే, సౌత్ నుంచి మరో క్రేజీ సినిమా దేశం మొత్తం హాట్ టాపిక్ అవుతుందని చెప్పొచ్చు.