రివ్యూ: నా నువ్వే

Last Updated on by

రివ్యూ: నా నువ్వే
న‌టీన‌టులు: క‌ళ్యాణ్ రామ్, త‌మ‌న్నా, ప్ర‌వీణ్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: జ‌యేంద్ర‌
నిర్మాత‌: మ‌హేశ్ కోనేరు

క‌ళ్యాణ్ రామ్ సినిమా అంటే ముందు గుర్తొచ్చేది మాస్ సినిమాలే. ఆయన ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల్లో ఎక్కువ‌గా క‌నిపించేది యాక్ష‌న్ సినిమాలే. ఇప్పుడు తొలిసారి ప్రేమ‌క‌థ‌లో న‌టించాడు ఈ హీరో. మ‌రి నా నువ్వే అంటూ క‌ళ్యాణ్ చేసిన ఈ ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అయింది..?

క‌థ‌:
వ‌రుణ్ (క‌ళ్యాణ్ రామ్) యుఎస్ వెళ్లి అక్క‌డే సెటిల్ అవ్వాల‌నుకుంటాడు. అయితే అనుకోకుండా ఫ్లైట్ మిస్ అయి ఇండియాలో ఉండిపోతాడు. అలా ఒక్క‌సారి కాదు రెండు మూడు సార్లు జ‌రుగుతుంది. అదే స‌మ‌యంలో అనుకోకుండా మీరా(త‌మ‌న్నా) జీవితంలోకి వ‌రుణ్ వ‌స్తాడు. త‌న‌కు తెలియ‌కుండానే మీర‌కు ల‌క్కీ ఛామ్ అయిపోతాడు వ‌రుణ్. అప్ప‌ట్నుంచీ వ‌రుణ్ కోస‌మే వెతుకుతుంది. డెస్టినీని న‌మ్మి వ‌రుణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీరా. అదే స‌మ‌యంలో ఆర్జేగా మారుతుంది. ఆ రేడియో సిటీ నుంచే త‌న ప్రేమ‌ను గెలిపించుకోడానికి ప్ర‌య‌త్నిస్తుంది. మ‌రి వీళ్లిద్ద‌రూ క‌లిసారా.. లేదా.. ఎలా క‌లిసారు అనేది క‌థ‌.

క‌థ‌నం:
రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అని కొన్నేళ్లుగా కళ్యాణ్ రామ్ పై కంప్లైంట్ ఉంది. ఈ మ‌ధ్య వ‌చ్చిన ఎమ్మెల్యే కూడా రొటీన్ క‌థే. ఇలాంటి టైమ్ లో పూర్తిస్థాయి ప్రేమ‌క‌థ చేసి షాక్ ఇచ్చాడు క‌ళ్యాణ్ రామ్. నా నువ్వే అంటూ త‌మ‌న్నాతో రొమాన్స్ చేసాడు. అయితే త‌న‌కు కొత్త‌గా ఉంద‌ని ఆలోచించాడే కానీ ప్రేక్ష‌కుల‌కు ఈ ప్రేమ‌క‌థ కొత్త‌గా ఉంటుందా అని మాత్రం ఆలోచించ‌లేక‌పోయాడు క‌ళ్యాణ్. అందుకే నా నువ్వే మ‌రీ రొటీన్ క‌థ‌గా మారిపోయింది. తొలి సీన్ నుంచి ఎంత స్క్రీన్ ప్లే బేస్డ్ గా క‌థ న‌డిపించాలని ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించినా క‌థ మాత్రం అక్క‌డే తిరుగుతుంటుంది. ఓ బుక్ మ‌ళ్లీ మ‌ళ్లీ హీరో హీరోయిన్ల‌ను క‌లుపుతుంద‌ని ప్రేక్ష‌కుల‌ను క‌న్విన్స్ చేసేలా చెప్ప‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు ద‌ర్శ‌కుడు.

హ‌లో సినిమాలో విక్ర‌మ్ కూడా ఇలాంటి డెస్టినీని ఎక్కువ‌గా న‌మ్మాడు. అయితే దానికి మంచి స్క్రీన్ ప్లే హెల్ప్ అయింది. కానీ ఇక్క‌డ అది మిస్ అయింది. ఎంత‌సేపూ అక్క‌డే క‌థ తిరుగుతుండ‌టం.. హీరోయిన్ త‌లుచుకోగానే హీరో ముందు వాల‌డం అంత న‌మ్మ‌శక్యంగా అనిపించ‌దు. ఎంత డెస్టినీ అనుకున్నా కూడా మ‌రీ ఇంత‌గా ఉంటుందా అనేది న‌మ్మ‌లేం. హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుట్ట‌డానికి కూడా పెద్ద‌గా కార‌ణాలుండ‌వు. వ‌ర్షం సినిమాలో ప్ర‌భాస్, త్రిష‌లా డెస్టినీ అంటారంతే. ఆ త‌ర్వాత వాళ్లు క‌లుసుకునే తీరు కూడా పెద్ద‌గా ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. రెండు గంట‌ల సినిమా కూడా ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుందంటే ఎలా సాగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.

న‌టీన‌టులు:
క‌ళ్యాణ్ రామ్ కొత్త‌గా ఉన్నాడు.. అందులో అనుమానం లేదు. న‌ట‌న కూడా బాగానే ఉంది. అయితే ప్రేమ‌క‌థ‌కు ఇప్పుడు క‌ళ్యాణ్ సెట్ కాలేదు. గెట‌ప్ మార్చేసాడు కానీ ఆయ‌న జీన్స్ ఎక్క‌డికి పోతుంది. త‌మ‌న్నా ఉన్నంతలో బాగా చేసింది. అందంగా అందంతో మ‌రిపించింది. హీరో స్నేహితులుగా ప్ర‌వీణ్, వెన్నెల కిషోర్ ప‌ర్లేదు. అప్పుడ‌ప్పుడూ న‌వ్వించే బాధ్య‌త వెన్నెల తీసుకున్నాడు. ఇక పోసాని, త‌ణికెళ్ల భ‌ర‌ణి కూడా ఉన్నంతలో బానే చేసారు.

టెక్నిక‌ల్ టీం:
పిసి శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ గురించి చెప్ప‌డానికేం లేదు. ఆయ‌న వ‌ర్క్ గురించి చెప్పే స్థాయి కూడా మ‌న‌ది కాదు. ఆయ‌న త‌న వ‌ర‌కు అద్భుతంగా చూపించాడు విజువ‌ల్స్. కానీ ద‌ర్శ‌కుడి క‌థే స‌హ‌క‌రించలేదు. ఎడిటింగ్ వీక్ అనిపిస్తుంది. రెండు గంట‌ల న‌డివి ఉన్నా కూడా సినిమా ఎందుకో బాగా సాగిన‌ట్లు అనిపిస్తుంది. క‌థ పాత‌దే.. క‌థ‌నం మ‌రీ రొటీన్.. డెస్టినీని న‌మ్ముకుని క‌థ‌లు రాసుకున్న‌పుడు స్క్రీన్ ప్లే చాలా ప‌ర్ఫెక్ట్ గా ఉండాలి. అది ఈ చిత్రంలో మిస్ అయింది. సోల్ లేని ప్రేమ‌క‌థ‌లా అనిపిస్తుంది నా నువ్వే.

చివ‌ర‌గా:
నా నువ్వే.. భార‌మైన ప్రేమ‌క‌థ‌..

రేటింగ్: 2.25/5.0

User Comments