నా పేరు సూర్య రివ్యూ

రివ్యూ: నా పేరు సూర్య

న‌టీన‌టులు: అల్లుఅర్జున్, అను ఎమ్మాన్యువ‌ల్, శ‌ర‌త్ కుమార్, అర్జున్, న‌దియా

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: వ‌క్కంతం వ‌ంశీ

నిర్మాత‌లు: ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్, నాగ‌బాబు

నా పేరు సూర్య‌.. ఈ మ‌ధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. వ‌ర‌స విజ‌యాల‌తో దూకుడు మీదున్న అల్లుఅర్జున హీరో కావ‌డం.. తొలిసారి ఆయ‌న సైనికుడిగా న‌టించ‌డంతో చాలా అంచ‌నాలున్నాయి ఈ చిత్రంపై. మ‌రి ఇది నిజంగానే ఇప్పుడు అంచ‌నాలు అందుకుందా..? ఈ చిత్రంతో బ‌న్నీ మ‌రో హిట్ అందుకున్నాడా..?

క‌థ‌:

సూర్య‌(అల్లుఅర్జున్) ఓ సైనికుడు. కోపం ఎక్కువ‌గా ఉండే సైనికుడు. సోల్జ‌ర్ కు ఉండ‌కూడ‌ని ల‌క్ష‌ణాలున్నాయ‌ని అత‌న్ని మిల‌ట‌రీ నుంచి స‌స్పెండ్ చేస్తాడు క‌ల్న‌ల్(బోమ‌న్ ఇరాని). దాంతో సూర్య గాడ్ ఫాద‌ర్(రావు ర‌మేష్) రిఫ‌రెన్స్ తో క‌ల్న‌ల్ మ‌ళ్లీ సూర్య‌ను మిల‌ట‌రీలోకి తీసుకోడానికి ఒప్పుకుంటాడు. కానీ దానికి ఓ కండీష‌న్ పెడ‌తాడు. సూర్య ఆర్మీలోకి రావ‌డానికి రామ‌కృష్ణంరాజు(అర్జున్) తో లింక్ పెడ‌తాడు క‌ల్న‌ల్. అస‌లు ఈ రామ‌కృష్ణంరాజు ఎవ‌రు..? ఆయ‌న‌తో సూర్య‌కు ఏంటి సంబంధం..? ఆయ‌న మ‌ళ్లీ బోర్డ‌ర్ కు వ‌చ్చాడా లేదా అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం:

దేశం కోసం ప్రాణాలిచ్చేయ‌డం.. దేశం కోసం ఏదైనా చేసేయ‌డం.. దేశం కోసం అవ‌స‌ర‌మైతే చంపేయ‌డం.. ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో చూసాం. అలాంటి ఓ సాదాసీదా క‌థే ఈ నా పేరు సూర్య కూడా. కొత్త‌గా ఏం అనిపించదు ఈ చిత్రం. వ‌క్కంతం వంశీ సాధార‌ణ క‌థ‌నే రాసుకున్నాడు. దాన్ని కాస్త అసాధార‌ణంగా.. అంటే ఇంకాస్త టైట్ స్క్రీన్ ప్లే తో తీసుంటే సినిమా పేలిపోయుండేది. కానీ హానెస్ట్ అటెంప్ట్ అంటూనే మ‌ధ్య‌లో చాలా క‌మ‌ర్షియ‌ల్ దారులు తొక్కేసాడు వంశీ. దాంతో హానెస్ట్ అటెంప్ట్ కాస్త ఎటూ కాకుండా పోయింది. తొలి 20 నిమిషాలు సినిమాను హై రేంజ్ లో మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. ఇదే స్పీడ్ కానీ ఇంకాసేపు ఉండుంటే సూర్య‌పై ఒపీనియ‌న్ మ‌రోలా ఉండేది. కానీ కాసేప‌టికే క‌థ‌లో వేగం త‌గ్గి.. అన‌వ‌స‌ర‌పు కామెడీతో పాటు చిరాకు పుట్టించే రొమాన్స్ ఒక‌టి వ‌స్తుంది.

ఫ‌స్టాఫ్ లో హీరో ల‌వ్ ట్రాక్ అంతా సిల్లీగా అనిపిస్తుంది. ఏదో క‌థ ముందుకు న‌డ‌వాలి కాబ‌ట్టి అన్న‌ట్లుంటుంది. ఇక విల‌న్ ఎంట్రీ అంత రేంజ్ లో చూపించి.. చివ‌రికి ఆ కారెక్ట‌ర్ ను ముగించిన విధానం కూడా ఆక‌ట్టుకోలేదు. జ‌న్యూన్ గా చేసామ‌ని చెబుతూనే బ‌న్నీ ఇమేజ్ కోసం ఏమేం చేయాలో అన్నీ చేసాడు ద‌ర్శ‌కుడు. అవ‌స‌ర‌మైన‌పుడ‌ల్లా ఓ ఫైట్ వ‌చ్చింది. మ‌ధ్య‌లో అవ‌స‌రం లేక‌పోయినా పాట‌లొచ్చాయి. అరే అదిరిపోయిందిరా అనుకునే సీన్స్ చాలా త‌క్కువ‌గా వ‌చ్చాయి. సెకండాఫ్ లో సాయికుమార్ సీక్వెన్స్ ను ఇంకా హై రేంజ్ లో ఊహిస్తాం కానీ దాన్ని తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకోలేదు. క్లైమాక్స్ ను దేశ‌భ‌క్తితో ముగించి త‌న క‌థ‌ను జ‌స్టిఫై చేసాడు ద‌ర్శ‌కుడు.

న‌టీన‌టులు:

అల్లుఅర్జున్ ద‌ర్శ‌కున్ని బాగా న‌మ్మాడు. ఆయ‌న ఏం చెబితే అది చేసాడు. అందుకోస‌మే లుక్ తో పాటు బాడీలోకి సైనికుడిని కూడా బాగానే ఎక్కించుకున్నాడు. పూర్తిగా కొత్త‌గా క‌నిపించాడు. కానీ ఎందుకో అక్క‌డ‌క్క‌డా బ‌న్నీ ఈ పాత్ర‌కు స‌రిపోలేదేమో అనిపిస్తుంది. అన్ ఈజీగా మూవ్ అయ్యాడు ఇందులో. ఇక అను ఎమ్మాన్యువ‌ల్ కు చెప్పుకోడానికి ఏమీ లేదు పాట‌లు త‌ప్ప‌. అర్జున్ డిఫెరెంట్ గా ట్రై చేసాడు. ఆయ‌న పాత్ర కొత్త‌గా ఉంది. శ‌ర‌త్ కుమార్ విల‌న్ గా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. న‌దియా, రావు ర‌మేష్, పోసాని పాత్ర‌లు అలా వ‌చ్చెళ్ళిపోతాయంతే.

టెక్నిక‌ల్ టీం:

విశాల్ శేఖ‌ర్ మ్యూజిక్ కొత్త‌గా ఏం అనిపించ‌లేదు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సైనికా పాట విజువ‌ల్ గా అదిరిపోయింది. దేశం కోసం సైనికులు ప‌డే క‌ష్టం ఎలా ఉంటుంద‌నేది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు. ఇక సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. విజువ‌ల్స్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటివ్ వీక్ గా అనిపించింది. చాలా సీన్లు బోర్ కొట్టించాయి. ఇక ద‌ర్శ‌కుడిగా వ‌క్కంతం అనుకున్న ముద్ర వేయ‌లేక‌పోయాడు. కానీ ర‌చ‌యిత‌గా మాత్రం ఆక‌ట్టుకున్నాడు. కొన్ని మాట‌లు అద్భుతంగా రాసాడు. ఓవ‌రాల్ గా నా పేరు సూర్య ఈయ‌న‌కు డ్రీమ్ డెబ్యూ అయితే కాదు.

చివ‌ర‌గా:

నా పేరు సూర్య నా బిల్లు ఇండియ

రేటింగ్:2.75/5.0