విశాల్ ను కావాల‌నే చెడ్డోన్ని చేస్తున్నారా..?

త‌మిళ రాజకీయాలు ఎలా ఉంటాయో ఇప్పుడిప్పుడే హీరో విశాల్ కు అర్థ‌మ‌వుతుంది. అప్ప‌టి వ‌ర‌కు సినిమా పాలిటిక్స్ ను మాత్ర‌మే చూసాడు విశాల్. న‌డిగ‌ర్ సంఘం నిర్మాత‌ల మండలి ఎన్నిక‌ల్లో కూడా విజయం సాధించాడు విశాల్. బ‌హుశా బ‌య‌టి రాజ‌కీయాలు కూడా అంతే క‌దా అనుకున్నాడో ఏమో కానీ విశాల్ ఈజీగా పాలిటిక్స్ లోకి వ‌చ్చేయాల‌ని చూసాడు. కానీ ఆదిలోనే ఈయ‌న జోరుకు బ్రేకులు వేసారు త‌మిళ తంబిలు. రాజకీయాల్లో ఈయ‌న తొలి ప్రయత్నమే దారుణంగా బెడిసి కొట్టేసింది. ఆర్కే న‌గ‌ర్ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ గా పోటీకి నిల‌బ‌డాల‌ని అనుకుని భంగ‌ప‌డ్డ విశాల్ కు ఇప్పుడు సొంత ఇండ‌స్ట్రీలోనే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ విశాల్ ను దేవుడు అన్న‌వాళ్లే ఇప్పుడు దోషి అంటున్నారు.

విశాల్‌ ప్రస్తుతం నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఆ పదవికి విశాల్ అనర్హుడనీ.. ఈయ‌న‌ హయాంలో ఏడు కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనీ అవ‌త‌లి వ‌ర్గం ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాధిక, టి.రాజేందర్ లాంటి సీనియ‌ర్ న‌టులు కూడా విశాల్ పై మండి ప‌డుతున్నారు. అయితే విశాల్‌ మాత్రం ఈ రాజకీయాలు సినీ పరిశ్రమ పరవుని దిగజార్చేస్తాయి.. నా హయాంలో ఏ అక్ర‌మాలు జరగలేదు.. చేసిన ప్ర‌తీ ప‌నికి లెక్క‌లున్నాయి.. కావాలంటే చూడండి.. ఆరోప‌ణ‌లు చేసి మీ ప‌రువు మీరే తీసుకోవ‌ద్దంటున్నాడు.

విశాల్ పై విమ‌ర్శ‌లు చేసిన రాధిక‌, టి రాజేందర్ కు ప‌ర్స‌న‌ల్ గానూ ఆయ‌న‌తో గొడ‌వలున్నాయి. శ‌ర‌త్ కుమార్ తో విశాల్ కు ఉన్న గొడ‌వ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌డి భార్యే రాధిక‌. ఇక శింబుతో కొట్టుకునే వ‌ర‌కు వెళ్లింది విశాల్ వ్య‌వ‌హారం. అత‌డి తండ్రి టి రాజేంద‌ర్. అందుకే వీళ్లు చేసిన విమ‌ర్శ‌ల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు. మ‌రోవైపు కావాల‌నే విశాల్ ను చెడ్డోన్ని చేసే త‌తంగం త‌మిళ‌నాట జ‌రుగుతుంద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. ఈ విష‌యంలో రాజ‌కీయ పెద్ద‌లు కూడా త‌ల దూరుస్తున్న‌ట్లు అనుమానాలు వ‌స్తున్నాయి. మొత్తానికి ఎలాగైనా విశాల్ ను ప్రేక్ష‌కుల దృష్టిలో చెడ్డోడిగా మార్చాల‌నేది వాళ్ల ప్ర‌య‌త్నం. కానీ ఈ తెలుగ‌బ్బాయి మాత్రం వాళ్ల‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌ట్లేదు. చివ‌రికి ఈ సినిమా పాలిటిక్స్ ఎక్క‌డి వ‌ర‌కు చేర‌తాయో..?