వైజ‌యంతీలో నాగ్ అశ్విన్ భారీ సినిమా

మ‌హాన‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత‌ నాగ్ అశ్విన్ గ్యాప్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న క‌థ‌ల‌కు డిమాండ్ పెరిగింది. దీంతో ఏ హీరోతో సినిమా చేస్తాడు? ఎలాంటి కథ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాడా? వ‌ంటి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. తాజాగా ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికే స‌మ‌యం ఆస్న‌మైంది. కొద్ది సేప‌టి క్రిత‌మే వైజ‌యంతీ మూవీస్ త‌మ సొంత బ్యాన‌ర్లోనే నాగ్ అశ్విన్ త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని అధికారికంగా వెల్ల‌డించింది.

వచ్చే నెల‌లో కొత్త ప్రాజెక్ట్ మొద‌లు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందుకోసం విజువల్ ఆర్టిస్ట్స్,డిజైనర్స్, రైటర్స్ కావాల‌ని తెలిపారు. ఆస‌క్తిగ‌ల వారు త‌మ‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు అన్నారు. అయితే ఇందులో హీరో ఎవ‌రు? ఇత‌ర సాంకేతిక నిపుణులు ఎవ‌రు? వ‌ంటి వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. అతి త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు కూడా తెలిసే అవ‌కాశం ఉంది.