నాగ‌బాబు సెటైర్లు రివ్యూ రైట‌ర్ల‌పై

Last Updated on by

రివ్యూ రైట‌ర్ల‌పై ఈ మ‌ధ్య కాలంలో హీరోల విమ‌ర్శ‌లు ఎక్కువైపోయాయి. సినిమా ప్లాప్ అయితే చాలు.. అంతా రివ్యూ రైట‌ర్లే చేసారు.. వాళ్లే రేటింగ్స్ త‌క్కువేసి ప్రేక్ష‌కుల్ని రాకుండా ఆపేసార‌నే ధోర‌ణిలో మాట్లాడేస్తున్నారు. ఆ మ‌ధ్య బ‌న్నీ, హ‌రీష్ శంక‌ర్ కూడా డిజే టైమ్ లో మొత్తం రివ్యూ రైట‌ర్లే సినిమాను యావ‌రేజ్ గా మార్చేసిన‌ట్లుగా మాట్లాడేసారు. ఈ విష‌యంలో ఎన్టీఆర్ కాస్త బెట‌ర్.. కాస్త క్లాస్ గా బ‌ట్ట‌ర్ పూసిన‌ట్లు తిట్టాడు. అయితే రివ్యూ రైట‌ర్ల‌పై ఒక్కొక్క‌రికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. దీనిపై నాగ‌బాబు కూడా స్పందించాడు. అయితే బ‌న్నీ, ఎన్టీఆర్ మాదిరి వాళ్ల‌ను విమ‌ర్శించ‌లేదు ఈ మెగా బ్ర‌ద‌ర్.

రివ్యూలే సినిమాను డిసైడ్ చేస్తాయ‌నుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మ‌ని చెప్పాడు నాగ‌బాబు. సినిమా అద్భుతంగా ఉంద‌ని చెప్పినా కూడా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయ‌ని.. బాలేద‌ని రాసిన సినిమాలు ఇండ‌స్ట్రీ రికార్డులు బ్రేక్ చేసాయ‌ని చెప్పాడు నాగ‌బాబు. రివ్యూ అనేది చూసేవాడి ఒక్క‌డి కోణంలో ఉంటుంద‌ని.. అది కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌కు ఆపాదించ‌డం స‌రైంది కాదంటున్నాడు నాగ‌బాబు. రంగ‌స్థ‌లం సినిమాను కూడా కొంద‌రు పెద్ద‌గా ఏం లేదు.. యావ‌రేజ్ అని రాసార‌ని.. అది ఈ రోజు నాన్ బాహుబ‌లి రికార్డుల‌న్నింటినీ తుడిచి పెట్టేసింద‌ని గుర్తు చేసాడు నాగ‌బాబు. నా పేరు సూర్య‌పై కొంద‌రు కావాల‌నే నెగిటివ్ ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని మొన్న అల్లు అర‌వింద్ గారు అన్నారు క‌దా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఇలా స్పందించాడు నాగ‌బాబు.

సినిమా వాళ్లు రివ్యూ రైట‌ర్ల‌పై స్పందిస్తున్న తీరును కొంద‌రు త‌ప్పు ప‌డుతున్నారు. బాగున్న సినిమాను ఎవ‌రూ బాగోలేద‌ని చెప్పి ఆప‌లేరు.. బాలేని సినిమాను ఎంత ప్ర‌మోట్ చేసినా చూసే ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కులు కూడా లేరు.. వాళ్లు ఒక్కో సినిమాకు ఫ్యామిలీతో థియేట‌ర్ కు వ‌చ్చి 1000 రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న‌పుడు ఖచ్చితంగా వాళ్లకు బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వాల్సిన బాధ్య‌త మాపై ఉంటుందంటున్నాడు ఆ మ‌ధ్య మ‌హేష్. అది త‌ప్పిన‌పుడు వాళ్ళు సినిమా చూడ‌రు. అంత మాత్రానికే అంతా రివ్యూ రైట‌ర్లే చేసార‌న‌డం త‌ప్పు. అయితే విమ‌ర్శ అనేది కాస్త తెలివిగా ఉంటే బాగుంటుంది.. క్రియేటివిటీగా ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుందంటున్నారు విశ్లేష‌కులు. మొత్తానికి రివ్యూ రైట‌ర్లే సినిమాను ఫ్లాపులు చేస్తున్నార‌ని మాట్లాడుకునే కొంద‌రు హీరోల‌కు నాగ‌బాబు మాట‌లు బాగానే చుర‌క‌లంటించాయి.

User Comments