చైతూ – సమంతల ప్రేమకథతో సినిమా..?

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే తన లేటెస్ట్ మూవీ ‘యుద్ధం శరణం’ తో కూడా మరో సక్సెస్ కొట్టడానికి రెడీగా ఉండటంతో చైతూలో మంచి ఎనర్జీ కనిపిస్తోంది. ఇదే సమయంలో రియల్ లైఫ్ లో హీరోయిన్ సమంతతో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండటంతో.. చైతూ ఆనందంలో మునిగితేలిపోతున్నాడు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చైతూ మాటలు వింటే.. ఏ రేంజ్ లో కుర్రాడు కుమ్మేస్తున్నాడో అర్థమవుతుంది. ఆ స్టోరీలోకి వెళితే, రిలీజ్ కు రెడీ అవుతున్న ‘యుద్ధం శరణం’ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చైతూ రేడియో మిర్చి ఎఫ్.ఎల్ లో పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్బంగా తన పర్సనల్ లైఫ్ ముచ్చట్లను కూడా శ్రోతలకు చైతూ వినిపించడం విశేషం.
ముఖ్యంగా కాబోయే భార్య సమంత కోపం గురించి చెబుతూ.. తన మొబైల్ లో ఎప్పుడూ ఒక ఫెరారీ కారు ఫోటో వాల్ పేపర్ గా ఉంటుందని, ఇలాంటి చిన్న చిన్న విషయాలు సమంతకు కోపం తెప్పిస్తాయని చైతూ చెప్పుకొచ్చాడు. దీంతో కోపం వస్తే సమంత ఏం చేస్తుందనే ప్రశ్నకు కూడా చైతూ సమాధానం చెబుతూ.. తను కోపంగా ఉన్నప్పుడు చాలా సీరియస్ గా చూస్తుందని, కానీ గొడవలు ఏమీ పెట్టుకోదని తెలిపాడు. ఇదే సమయంలో సమంత ప్రపంచంలోనే ఓ గొప్ప వ్యక్తి అంటూ ఆకాశానికి ఎత్తేసిన చైతూ.. తనకంటే అందమైన అమ్మాయి మరొకరు లేరు అంటూ మురిసిపోయాడు. చివరగా తమ ప్రేమకథను ఎవరైనా సినిమాగా తెరకెక్కిస్తే ఏమాత్రం అభ్యంతరం చెప్పనని నాగచైతన్య ఓపెన్ ఆఫర్ ఇవ్వడం విశేషం. మరి సెలబ్రిటీ లైఫ్ స్టైల్ తో పాటు కోపాలు, తాపాలు, ముద్దులు, ముచ్చట్లు, సీక్రెట్లు, సక్సెస్ లతో నిండివున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని ఎవరైనా తెరకెక్కిస్తారేమో చూడాలి.