చైతూ ‘సవ్యసాచి’ స్టోరీ లైన్ ఇదే..!

సవ్యసాచి.. ఈ పేరుకున్న అర్థం తెలిస్తే క్రేజీగా అనిపిస్తోంది. రెండు చేతులతోనూ ఒకే విధమైన నైపుణ్యం ప్రదర్శించేవాడిని సవ్యసాచి అంటూ ఉంటారు. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టే పురాణాల్లో అర్జునుడిని మాత్రమే ‘సవ్యసాచి’ గా సంబోధించారు. ఇక ఆ తర్వాత చాలా మంది సవ్యసాచి గా పిలిపించుకున్నారు గాని, రెండు చేతులతోనూ ఒకేలా పని చేయగలగడం అనేది మామూలు విషయం కాదనే విషయాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మరి అలాంటి సవ్యసాచి పేరును టైటిల్ గా పెట్టి సినిమా తీయాలంటే.. ఆ డైరెక్టర్ కు ఎన్ని గట్స్ ఉండాలి.
అయితే, టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ క్రేజీ కాన్సెప్ట్ ను.. నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ అంటూ అనౌన్స్ చేయడంతో సినీ జనాలకు కూడా ఓ క్రేజీ సినిమా చూడబోతున్నామనే భావన బాగానే కలిగింది. అందులోనూ స్టార్టింగ్ లోనే టైటిల్ కు తగ్గట్లు చైతూ పోస్టర్ ను డిజైన్ చేయడంతో భారీ అంచనాలు ఆదిలోనే పీఠం వేశాయి. దీంతో అప్పటినుంచి సవ్యసాచి అనే టైటిల్ కు ఉన్న అర్థాన్ని సినిమాలో చందూ మొండేటి ఎలా జస్టిఫై చేస్తాడనే డిస్కషన్స్ బాగానే పెరిగాయి. ఇలాంటి టైమ్ లో చైతూ తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టి స్వీట్ షాక్ ఇచ్చాడు. ఆ స్టోరీలోకి వెళితే, ఈ సినిమాలో హీరో ఎడమచేయి అతడి ఆధీనంలో ఉండదట.
ముఖ్యంగా కుడి చేతికి ఉన్నట్లే శక్తి, నైపుణ్యం అదే స్థాయిలో అతని ఎడమ చేతికి ఉన్నా కూడా.. అది అతని కంట్రోల్ లో ఉండదట. మొత్తంగా మెదడుకు, ఆ చేతికి అసలు కనెక్షనే ఉండదని, ఆ కారణంగా హీరో ప్రమేయం లేకుండానే ఆ చేయి వేరే వ్యక్తిది అన్నట్లు స్వతంత్రంగా ప్రవర్తిస్తుందని అంటున్నారు. దీంతో ఈ రకమైన లక్షణాల వల్ల హీరోకి లాభం చేకూరిందా? లేక నష్టం వాటిల్లిందా?.. మొత్తంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనేదే సినిమా స్టోరీ అని చెప్పుకొచ్చారు. మరి ఇలాంటి క్రేజీ థాట్స్ ను సినిమాగా డీల్ చేయడం అనేది కత్తిమీద సాము అనే అనాలి. నిజంగా మరి చందూ మొండేటి దీనిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తే.. సినిమా స్థాయి వేరే రకంగా ఉంటుందని చెప్పొచ్చు.