నాగ‌శౌర్య రేంజ్ పెరిగింది

Last Updated on by

నాగ‌శౌర్య రేంజ్ మారింది. అదేంటి.. మ‌నోడికి ఒక్క హిట్ ప‌డ‌గానే స్టార్ అయిపోయాడా ఏంటి అనుకోకండి..! కార్ వాడ‌టంలో మ‌నోడి రేంజ్ బెంజ్ కి చేరిపోయింది. ఛ‌లో సినిమాతో కెరీర్ లో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు నాగ‌శౌర్య‌. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన పెద్ద హిట్ ఇదే కావ‌డం విశేషం. 6 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం.. 13 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న శౌర్య కెరీర్ కు ఛ‌లో ఊపిరి పోసింది. ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనంద‌మో.. లేదంటే నిజంగానే ఓ కార్ కొనాల‌ని ముందే ఆలోచించాడో ఏమో గానీ.. ఏకంగా కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కున్నాడు శౌర్య. కాదు కాదు.. ఛ‌లో నిర్మాత, నాగ‌శౌర్య త‌ల్లి ఉషా మ‌ల్పూరి కొనిచ్చింది.

సెంటిమెంట్ ప్రకారం అమ్మతో కలిసి ఫస్ట్ డ్రైవ్ కూడా చేసాడు. ఇక్క‌డ అంతా బాగానే ఉంది కానీ నాగ శౌర్య మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు. బాహుబ‌లి కజిన్ లా గ‌డ్డం పెంచేసి.. కొత్త‌గా ద‌ర్శ‌నం ఇచ్చాడు. ఇది ఖాళీగా ఉన్న‌పుడు ఏం చేయాలో తెలియ‌క పెంచిన గ‌డ్డం అంటున్నాడు ఈ హీరో. ఇప్ప‌టికే షాలినితో అమ్మ‌మ్మ‌గారిల్లు.. సాయిప‌ల్ల‌వితో క‌ణం సినిమాలు పూర్తి చేసాడు శౌర్య‌. ఈ రెండూ త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి. ఇక మే నుంచి శ్రీ‌నివాస్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో న‌ర్త‌న‌శాల సినిమా చేయ‌బోతున్నాడు నాగ‌శౌర్య‌.

User Comments