వారం రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు..

ఓ హీరో న‌టించిన రెండు సినిమాలు వారం రోజుల గ్యాప్ లో విడుద‌లైతే అంత‌కంటే వింత మ‌రోటి ఉండ‌దు. ఇప్పుడు నాగ‌శౌర్య విష‌యంలో ఇదే జ‌ర‌గ‌బోతుంది. ఈయ‌న ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా ఫ్లాపులిచ్చినా కూడా మ‌నోడి సినిమాల‌పై ఆస‌క్తి మాత్రం బాగానే క‌నిపిస్తుంది. త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల‌తో ఛ‌లో సినిమా చేస్తున్నాడు. ఇందులో క‌న్న‌డ సంచ‌ల‌నం ర‌ష్మిక మండ‌న్న హీరోయిన్ గా న‌టిస్తుంది. తెలుగు-త‌మిళ‌నాడు నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగ‌నుంది. ఈ మ‌ధ్యే తాజాగా విడుద‌లైన టీజ‌ర్.. మొన్న విడుద‌లైన పాట చూస్తే ఛ‌లోపై త‌క్కువ అంచ‌నాలు వేసుకోడానికి అయితే లేదు. క‌చ్చితంగా ఈ చిత్రంతో ఏదో మాయ చేయ‌బోతున్నాడు నాగ శౌర్య‌. డిసెంబ‌ర్ 29న రావాల్సిన ఈ చిత్రం భారీ సినిమాల కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి 2కి వాయిదా ప‌డిపోయింది.

ఇక ఛ‌లోతో పాటు తాజా సంచ‌ల‌నం సాయిప‌ల్ల‌వితో క‌లిసి క‌రు సినిమాలో న‌టిస్తున్నాడు నాగ‌శౌర్య‌. తెలుగులో ఈ చిత్రం క‌ణంగా విడుద‌ల కానుంది. ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌కుడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. సాయిప‌ల్ల‌వి ఎంట్రీతో సినిమా రేంజ్ పెరిగింది. ఈ భామకు ఉన్న ఇమేజ్ త‌న‌కు హిట్ తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నాడు నాగ‌శౌర్య‌. తెలుగులో క‌ణంగా వ‌స్తుంది క‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిప‌ల్ల‌వికి ఫ్లాప్ లేదు. ఈమె ఏ భాష‌లో న‌టించినా.. ఏ సినిమా చేసినా అన్నీ విజ‌యాలే. పైగా సాయిప‌ల్ల‌వి సొంత భాష త‌మిళ్ లో న‌టిస్తున్న తొలి సినిమా క‌రు. దాంతో క‌రుపై అక్క‌డ అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. అంటే వారం రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు రానున్నాయ‌న్న‌మాట‌. ఈ విషయంలో నాగ‌శౌర్య చేసేదేం ఉండ‌దు కాబ‌ట్టి త‌న సినిమాల కోసం వేచి చూస్తూ ఉన్నాడు ఈ కుర్ర హీరో. మ‌రి ఈ రెండు సినిమాలు శౌర్యను ఏం చేయ‌బోతున్నాయో..?