ఛ‌లో.. మ‌రో బృందావ‌నం కాదు క‌దా..!

ఇండ‌స్ట్రీలో కొత్త సినిమాలంటూ ఏవీ ఉండ‌వు. ఉన్న‌వ‌న్నీ కొన్ని క‌థ‌లే వాటినే మ‌ళ్లీ మ‌ళ్లీ తిప్పితిప్పి తీసి పిప్పి చేయాల్సిందే త‌ప్ప కొత్త క‌థ‌లంటూ రావు. కొత్త‌గా వ‌చ్చినా అందులోనూ ఏదో ఓ రొటీన్ ఉంటుంది. అందుకే పాత క‌థ‌ల‌నే మ‌ళ్లీ కొత్త‌గా ప్ర‌జెంట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు ద‌ర్శ‌కులు.. వాళ్ల‌ను న‌మ్ముతున్నారు మ‌న హీరోలు. ఇప్పుడు నాగ‌శౌర్య న‌టించిన ఛ‌లో కూడా ఇలాగే అనిపిస్తుంది. ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాపై అంచ‌నాలు లేక‌పోయినా.. టీజ‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా ఆస‌క్తి మొద‌ల‌వుతుంది.

త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. గురువుతోనూ టీజ‌ర్ లాంఛ్ కూడా చేయించాడు వెంకీ. తెలుగు-త‌మిళ‌నాడు బోర్డ‌ర్ నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగుతుంది. టీజ‌ర్ చూసిన త‌ర్వాత ఇది మ‌రో బృందావ‌నం, అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి క‌థ‌ల్లా అనిపిస్తుంది. అందులోనూ అనుకోని కార‌ణాల‌తో విడిపోయిన గ్రామాల మ‌ధ్య ప్రేమ‌లుండ‌వు.. పంథాలు త‌ప్ప‌. ఇప్పుడు ఛ‌లో టీజ‌ర్ కూడా ఇలాగే అనిపిస్తుంది. అయితే ఇందులో ట్రీట్ మెంట్ మ‌రోలా ఉందేమో..? అది ఇప్పుడే క‌మెంట్ చేయ‌డం క‌ష్టం. క‌న్న‌డ సంచ‌ల‌నం ర‌ష్మిక మండ‌న్న హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది టీం. డిసెంబ‌ర్ 29న చ‌లో విడుద‌ల కానుంది.