చిచోరే రీమేక్ లో అక్కినేని వార‌సుడు

అక్కినేని నాగ‌చైత‌న్య కెరీర్ జెట్ స్పీడ్ లో ఉంది. మ‌జిలీ విజ‌యం త‌ర్వాత మార్కెట్ మెరుగుప‌డ‌టంతో క‌మిట్ మెంట్ల జోరు పెంచాడు. ఇటీవ‌లే వెంకీ మామ షూటింగ్ పూర్తిచేసాడు. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ములా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ఆర్ ఎక్స్ -100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి తో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇంకా ప‌లువురు యంగ్ డైరెక్ట‌ర్ల స్ర్కిప్ట్ ల‌ను హోల్డ్ లో పెట్టాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ రీమేక్ పైనా క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల బాలీవుడ్ విజయం సాధించిన చిచోరే రీమేక్ పై ఆస‌క్తిగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే బ్యాంకెండ్ టీమ్ ను రెడీ చేస్తున్న‌ట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ రీమేక్ కోసం గీత‌గోవిందం ద‌ర్శ‌కుడు ప‌రుశురాం బుజ్జిని రంగంలోకి దింపుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఓ పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించ‌డానికి ముందుకొస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే తుదిగా చై నిర్ణ‌యం తీసుకునే ముందు మ‌రోసారి చిచోరే వాచ్ చేయ‌నున్న‌ట్లు తెలిసింది.