చైతూ క‌ల నెర‌వేరుతుందా?

Last Updated on by

మాస్ హీరోగా నిరూపించుకోవాలి! అప్పుడే బాక్సాఫీస్ వ‌ద్ద జోరు పెరుగుతుంది ఏ హీరోకి అయినా. క్లాస్ హీరో అన్న ముద్ర ప‌డితే ఆ మేర‌కు బిజినెస్ ప‌రిమిత‌మైపోతుంది. పైగా మాస్ ఆద‌ర‌ణ జీరో అయిపోతుంది. అలాంటి ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుని గ‌ట్టెక్కితేనే ఏ హీరోకి అయినా మ‌నుగ‌డ‌. స‌రిగ్గా ఇదే పాయింట్ అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌ను తొలి నుంచి క‌ల‌వ‌ర‌పెడుతూనే ఉంది. ఇప్పుడు ఆ అంకాన్ని అధిగ‌మించేందుకు శాయాశ‌క్తులా శ్ర‌మిస్తున్నాడు. మునుముందు రిలీజ్‌కి వ‌స్తున్న శైల‌జారెడ్డి అల్లుడు, స‌వ్య‌సాచి టార్గెట్ కూడా ఇదే. ఈ రెండు సినిమాల‌తో మాస్‌లోకి, ఫ్యామిలీలోకి మ‌రింత బ‌లంగా దూసుకుపోవాల‌న్న‌ది అక్కినేని హీరో అండ‌ర్ క‌రెంట్ గేమ్ ప్లాన్‌.

అయితే ఇది ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క‌వుట‌వుతుంది? అన్న‌ది కాస్త ఆగితే కానీ తెలీదు. ఈనెలాఖ‌రున మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `శైల‌జారెడ్డి అల్లుడు` రిలీజ‌వుతోంది. ఆ త‌ర్వాత మ‌రో నెల‌రోజుల్లో `స‌వ్య‌సాచి` రిలీజ్‌కి రానుందిట‌. లేటెస్ట్‌గా రిలీజైన శైల‌జారెడ్డి పోస్ట‌ర్లు చూస్తే ఈ సినిమాలో పొగ‌రుమోతు అయిన‌ అత్త కూతురిని ఏడిపించే కుర్రాడిగా చైత‌న్య న‌టిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అంటే అత‌డి పాత్ర‌లోకి మాసిజాన్ని మారుతి బాగా పంప్ చేశాడ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇక అత్త శైల‌జ‌తో క‌థ ఆరంభంలో శ‌త్రువుగా క‌నిపించే చైతూ, ఆ త‌ర్వాత అత్త విసిరిన ఓ ఛాలెంజ్ కోసం క‌త్తి ప‌డ‌తాడ‌ని చెబుతున్నారు. అంటే మాస్ ఎలిమెంట్స్‌ని ఏర్చి కూర్చ‌డానికి అవ‌కాశం ఉన్న ఏ విభాగాన్ని మారుతి వ‌దిలిపెట్ట‌లేద‌ని భావించ‌వ‌చ్చు. అల్ల‌రి అల్లుడు ఫార్ములాని అప్ల‌య్ చేస్తూనే, దీంట్లో ఫ్యాక్ష‌న్ యాక్ష‌న్‌ని ఎలివేట్ చేస్తున్నార‌ని చైతూ క‌త్తిప‌ట్టిన‌ పోస్ట‌ర్ చెబుతోంది. అత్త‌తో, అత్త కూతురితో, కామ‌న్ రైవ‌ల్స్‌తో పెట్టుకుని ఛాలెంజ్‌ని చై ఒంటిచేత్తో ఎలా నెర‌వేర్చాడు? అన్న‌దే జ‌యాప‌జ‌యాల‌కు కార‌ణ‌మ‌వుతుంది. ఇక మ‌రో సినిమా `స‌వ్య‌సాచి` క‌థ ప‌రంగా థ్రిల్ల‌ర్ మోడ్‌లో ఉంటుంద‌ని, ఫ్యామిలీ అనుబంధాల‌కు తావిచ్చార‌ని తెలుస్తోంది. మాధ‌వ‌న్‌తో ఢీకొట్టే హీరోగా చైతూ ఆ చిత్రంలో క‌నిపించ‌నున్నాడు. అంటే అభిమానుల్లో అది క్యూరియ‌స్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల‌తో చైతూలోని మాసిజం ప‌రాకాష్ట‌కు చేరుతుందా.. లేదా? ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌. ఆగ‌స్టు 31న `శైల‌జారెడ్డి అల్లుడు` రిలీజ్ త‌ర్వాత దీనిపై ముచ్చ‌టిద్దాం.

User Comments