ఆఫీస‌ర్ అయింది.. ఇప్పుడు నేల‌టికెట్..

Last Updated on by

అదేంటో కానీ నాగార్జున‌కు అంద‌రూ ఫ్లాప్ డైరెక్ట‌ర్లే త‌గులుతున్నారు. పాత ఫ్రెండ్ క‌దా.. పాతికేళ్లైంది క‌దా అని వ‌ర్మ‌ను న‌మ్మితే నిండా ముంచేసాడు నాగార్జున‌ను. ఈయ‌న చేసిన ఆఫీస‌ర్ అరాచ‌కాలు చేసింది. క‌నీసం కోటి రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేక డిజాస్ట‌ర్ల‌కే బాప్ లా మారిపోయింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్ర ఘ‌న‌త‌ను చాలా త్వ‌ర‌గానే మ‌రిచిపోయాడు నాగార్జున‌. అది మ‌రిచిపోయి సింపుల్ గా త‌న ప‌ని తాను చేస్తున్నాడు. ఈ హీరో ప్ర‌స్తుతం శ్రీ‌రామ్ ఆదిత్య‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యింది. నాని ఇందులో మ‌రో హీరో. సెప్టెంబ‌ర్ 12న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు క‌ళ్యాణ్ కృష్ణ‌తో ఓ సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు నాగార్జున‌.

గ‌తంలో అక్కినేని కుటుంబానికి రెండు విజ‌యాలు ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. సోగ్గాడే అంటూ నాగ్ కెరీర్ లో తొలి 50 కోట్ల సినిమా ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు.. రారండోయ్ వేడుక చూద్ధాం తో నాగ‌చైత‌న్య‌కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఈ రెండు విజ‌యాల త‌ర్వాత నేల‌టికెట్ తో నేల‌కు దిగిపోయాడు. ఇప్పుడు మ‌రోసారి నాగార్జుననే న‌మ్ము కుంటున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ఇక నాగ్ కూడా ఈ ద‌ర్శ‌కుడు సిద్ధం చేసిన బంగార్రాజు క‌థ‌కు బాగానే క‌నెక్ట్ అయ్యాడు. దాంతో పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయాల్సిందిగా కోరాడు. ఇదే ఏడాది బంగార్రాజు తెర‌పైకి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన పనిలేదు. ఎందుకంటే నేల‌టికెట్ షాక్ తో క‌ళ్యాణ్ కూడా ఇప్ప‌ట్లో బ‌య‌టికి రావ‌డం క‌ష్ట‌మే. దాంతో ఇప్పుడు అటు ఫ్లాప్ హీరో.. ఇటు ఫ్లాప్ ద‌ర్శ‌కుడు కాంబినేష‌న్ క‌ల‌వ‌క త‌ప్ప‌దు.

User Comments