ఆఫీస‌ర్ టీజ‌ర్ 2.. పాత పాటే..!

Last Updated on by

నాగార్జునతో వ‌ర్మ సినిమా అన‌గానే తెలియ‌కుండానే అంచ‌నాలు పెరిగిపోతాయి. ఎందుకంటే ఇండియాను ఊపేసిన కాంబినేష‌న్ ఇది. శివ‌తో 30 ఏళ్ల కింద స‌రికొత్త ట్రెండ్ కు తెర‌తీసింది ఈ కాంబినేష‌న్. ఆ త‌ర్వాత చేసిన సినిమాలేవీ ఆడ‌లేదు. మ‌ళ్లీ పాతికేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఆఫీస‌ర్ అంటూ వ‌స్తున్నారు నాగార్జున, వ‌ర్మ‌. తాజాగా ఈ చిత్ర రెండో టీజ‌ర్ విడుద‌లైంది. ఇప్ప‌టికే విడుద‌లైన తొలి టీజ‌ర్ పెద్ద‌గా ఏం లేద‌నే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఏదో వ‌ర్మ గ‌త సినిమాల‌తో పోలిస్తే గ్రాండ్ గా అనిపించింది అంతే. ఇక ఇప్పుడు రెండో టీజ‌ర్ కూడా అంతే. కాక‌పోతే ఈ సారి ఫ్యామిలీ ఎమోష‌న్స్ చూపించాడు. ఇది చూసిన త‌ర్వాత వ‌ర్మ ఏమీ మార‌లేద‌ని మ‌రోసారి అర్థ‌మైపోతుంది. కాపోతే ఈ మ‌ధ్య ఆయ‌న చేసిన క‌ళాఖండాల‌తో పోలిస్తే ఇది కాస్త బెట‌ర్ గా అనిపిస్తుంది. నాగ్ త‌న స్టైల్ తో చంపేసాడు.

గ‌త కొన్నేళ్ల‌లో నాగ్ ఇంత స్టైల్ గా  ద‌ర్శ‌కుడు చూపించ‌లేదు. పైగా ఇందులో నాగార్జున‌కు ఓ పాప కూడా ఉంటుంది. హీరోయిన్ ఉండ‌దు.. నాగ్ కు రొమాన్స్ ఉండ‌దు.. హైద‌రాబాద్ నుంచి ముంబైకి ఓ కేస్ సాల్వ్ చేయ‌డానికి వ‌చ్చే ఆఫీస‌ర్ క‌థ ఇది. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చి కొత్త‌గా ముంబైలో వాడేమైనా పీకుతాడా అంటూ డైలాగ్ కూడా పెట్టాడు వ‌ర్మ‌. రెండో టీజ‌ర్ అయితే రొటీన్ గానే ఉంది కానీ తీసిపారేసేలా మాత్రం లేదు. ఏమో అన్నీ కుదిర్తే ఇదే సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెప్పించినా మెప్పించొచ్చు. ఎందుకంటే బ‌డ్జెట్ త‌క్కువ‌.. లాభాలు ఎక్కువ ఉంటాయి వ‌ర్మ సినిమాల‌కు. ఈ సారి నాగార్జున కూడా ఉన్నాడు కాబ‌ట్టి ఆఫీసర్ ఏ మాయ చేస్తాడో..! మే 12న ట్రైల‌ర్.. 25న సినిమా విడుద‌ల కానుంది.

User Comments